తిరువళ్లూరు: జాప్యం లేకుండా వరికొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం తామరపాక్కం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి సంఘం జిల్లా కార్యదర్శి సంపత్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, గోనె సంచీలు, ధాన్యాన్ని లోడింగ్, అన్‌లోడింగ్ కోసం వసూలు చేస్తున్న మామూళ్లను వెంటనే కట్టడి చేయాలని, వరిని తూర్పార పట్టడానికి రుసం వసూలు చేయడాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించామని చెబుతూనే 40 కిలోల బ్యాగుకు రూ.60 మేరకు అధికారులు వసూలు చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి రైతుల నుంచి గుంజుతున్న మొత్తాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. దీంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని సైతం డిమాండ్ చేశారు. సంఘం నేతలు రవి, తిరుపతి, శ్రీనివాసన్, రామమూర్తి, సంఘం నేతలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


