వేలూరు: రాణిపేట జిల్లా రత్నగిరి గ్రామంలో వెలసిన బాలమురుగన్ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ శివాచార్యుల వేద మంత్రాల నడుమ ఆలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ధ్వంజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఆలయ బాలమురుగన్ అడిమై స్వామిజీ అధక్షతన శివాచార్యులు ధ్వజాస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి పుష్పాలతో అలంకరించారు. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు పది రోజుల పాటు జరగనున్నాయి. ఈనెల 30న రథోత్సవం, జూన్1న స్వామి వారికి తీర్థవారి నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగించనున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి పరంధామకణ్ణన్, ఆలయ ప్రధాన అర్చకులు కేఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.


