వేలూరు: రాణిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట నల్ల దుస్తులతో కూడిన కోడి గుడ్డు, కొత్త దుత్త తదితర వాటిని ధ్వంసం చేసి క్షుద్రపూజలు చేసిన సంఘటన సంచలనం రేపింది. రాణిపేట జిల్లా సిప్‌కాట్‌లోని భారతినగర్‌లో కలెక్టర్ కార్యాలయం నడుస్తోంది. అయితే కలెక్టరేట్ ముఖ ద్వారంలోనే పోలీసులు 24 గంటలపాటు బందోబస్తులో ఉంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని ముఖ ద్వారం ఎదుట కోడి గుడ్డు, పసుపు, కుంకుమ, కొత్త దుత్త, నల్ల దుస్తులను ధ్వంసం చేసి ఉన్నారు. మరో కొత్త దుత్తలో పైన మాత్రం పగలగొట్టి కింద అడుగు భాగంలో నీటిని ఉంచారు. వీటిని గమనించిన కలెక్టరేట్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో క్షుద్రపూజలు చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కలెక్టరేట్ ఎదుట సీసీటీవీ కెమోరాలో ఏమైనా నమోదు అయిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.


