సాక్షి, చైన్నె: పిల్లల ఆసుపత్రులలో ఒకటైన చైన్నెలోని కంచి కామకోటి చైల్డ్‌ట్రస్ట్ హాస్పిటల్‌లో అత్యాధునికంగా పునరుద్ధరించిన జనరల్ వార్డ్‌ను శుక్రవారం ప్రారంభించారు. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ఈ వార్డ్ ఆధునీకరణకు పూర్తి ఆర్థిక సహాయం అందించింది. ఈ నూతన జనరల్ వార్డ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ మానవ వనరుల విభాగం అధిపతి ఆలోక్ షియోపుర్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ట్రస్టీలు, ప్రముఖ వైద్యులు, సిబ్బంది, ఆహ్వానితులు పాల్గొన్నారు. సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ద్వారా పాత జనరల్ వార్డ్‌ను పిల్లలకు నచ్చేలా, ఎంతో ఆహ్లాదకరంగా, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా, రోగులకు అనుకూలమైన వైద్య వాతావరణంగా తీర్చిదిద్దారు. మొత్తం 34 పడకల సామర్థ్యం ఉన్న ఈ జనరల్ వార్డు ఈ ఆసుపత్రిలోనే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ఇన్‌పేషెంట్ వసతిగా ప్రకటించారు. తమిళనాడుతోపాటు పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే ఆర్థికంగా వెనుకబడిన, పేద కుటుంబాల పిల్లలకు ఈ వార్డ్ ఎంతో ఆసరాగా నిలుస్తోందని వివరించారు. ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జనని శంకర్, ఫండ్‌రైజింగ్ హెడ్ శంకర్ రమణి తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.


