విస్తరించిన విజయ్‌ కేబినెట్‌ | - | Sakshi
Sakshi News home page

విస్తరించిన విజయ్‌ కేబినెట్‌

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

నిన్న కాంగ్రెస్‌, నేడు వీసీకే, ఐయూఎంఎల్‌

టీవీకే కేబినెట్‌లో చేరిక

మంత్రులుగా వన్నియరసు, షాజహాన్‌

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ అర్లేకర్‌

షాజహాన్‌కు మైనారిటీ, వన్నియరసుకు సామాజిక న్యాయ శాఖ అప్పగింత

షాజహాన్‌, వన్నియరసు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్‌ అర్లేకర్‌, చిత్రంలో సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో అధికార మార్పు నేపథ్యంలో డీఎంకేకు కాంగ్రెస్‌ ఇచ్చిన షాక్‌ ఇంకా మరవక ముందే తాజాగా అదే బాటలో వీసీకే, ఐయూఎంఎల్‌లు బంధాన్ని తెంచుకున్నాయి. టీవీకే ప్రభుత్వంతో ఏకమయ్యే విధంగా మంత్రి వర్గంలో ఈ రెండు పార్టీలు శుక్రవారం చేరాయి. దీంతో వీసీకే, ఐయూఎంఎల్‌లకు చెందిన వన్నియరసు, షాజహాన్‌ మంత్రులయ్యారు.

డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, వీసీకేలు గత పదేళ్లుగా పయనం సాగిస్తూ వస్తుంటే, ఐయూఎంఎల్‌ మాత్రం కొన్ని దశాబ్దాలుగా బంధాన్ని ముడివేసుకుని ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఈ పార్టీల పయనించినా, తాజాగా అధికార మార్పుతో కొత్త నిర్ణయాలు తీసుకోకతప్పలేదు. సీఎం విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముందుగా కాంగ్రెస్‌ అధికారికంగా మద్దతు ఇవ్వగా, బయట నుంచి సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్‌లు మద్దతు ఇచ్చాయి. అయితే, మంత్రి వర్గంలోకి రావాలన్న టీవీకే ప్రభుత్వ ఆహ్వానానికి వీసీకే, ఐయూఎంఎల్‌లు స్పందించాయి. దీంతో కాంగ్రెస్‌ బాటలో వీసీకే, ఐయూఎంఎల్‌లు డీఎంకేకు కటీఫ్‌ చేప్పక తప్పలేదు. కూటమి నుంచి బయటకు వచ్చిన ఈ పార్టీలు ప్రభుత్వానికి పూర్తి మద్దతుతో అధికారంలో వాటాను పొందాయి. విజయ్‌ సంకీర్ణ ప్రభుత్వంలో శుక్రవారం వీసీకే, ఐయూఎంఎల్‌లు భాగస్వామ్యం కావడం రాజకీయంగా చర్చకు దారి తీసినా, డీఎంకేకు మాత్రం పెద్ద షాక్కే.

మంత్రులుగా వన్నియరసు, షాజహన్‌ సీఎం విజయ్‌ నేతృత్వంలోని మంత్రివర్గంలో వీసీకే ఎమ్మెల్యే వన్నియరసు, ఐయూఎంఎల్‌ ఏ.ఎం. షాజహాన్‌న్‌ ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం, రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరికి సీఎం జోసెఫ్‌ విజయ్‌ తన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. వన్నియరసు విల్లుపురం జిల్లా దిండివనం నియోజకవర్గం నుంచి, షాజహాన్‌ తూత్తుకుడి జిల్లా పాపనాశం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరికి శాఖల కేటాయింపు కూడా పూర్తయ్యింది. షాజహాన్‌న్‌కు మైనారిటీ సంక్షేమ శాఖ, వన్నియరసుకు సామాజిక న్యాయశాఖ బాధ్యతలను అప్పగించారు. ఈ ఇద్దరి చేరికతో సీఎం విజయ్‌తో పాటు టీవీకే మంత్రి వర్గం సంఖ్య 35కు చేరింది.

అధికారమే అన్ని తాళాలకు మాస్టర్‌ కీ:

వన్నియరసు ఉద్వేగం

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగా వన్నియరసు మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత తిరుమావళవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని అన్ని సమస్యల తాళాలను అన్‌న్‌లాక్‌ చేయడానికి అధికారమే ఒక మాస్టర్‌ కీ అని డాక్టర్‌ అంబేడ్కర్‌ చెప్పారని గుర్తుచేశారు. మంత్రిగా ప్రజల ప్రశంసలు అందుకునేలా, అవినీతి రహితంగా, నిజాయితీగా పనిచేస్తానని వన్నియరసు స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వన్నియరసును సచివాలయంలోని చాంబర్‌లో సీటులో స్వయంగా తిరుమావళవన్‌ కూర్చోబెట్టారు. అనంతరం సీఎం విజయ్‌తో తిరుమావళవన్‌తో పాటు తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కలిశారు.

బుధవారం వరకు తొమ్మిది మంది మంత్రులే సీఎం విజయ్‌ కేబినెట్‌లో ఉన్నారు. గురువారం ఈ సంఖ్య పెరిగింది. తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన శ్రీనాథ్‌, కమలి, విజయలక్ష్మి, రంజిత్‌కుమార్‌, వినోద్‌, రాజీవ్‌, రాజ్‌కుమార్‌, గాంతిరాజ్‌, మదన్‌ రాజా, జగదీశ్వరి, విజయ్‌ బాలాజీ, లోకేష్‌ తమిళ్‌సెల్వన్‌, విజయ్‌ తమిళన్‌ పార్థిబన్‌, రమేష్‌, కుమార్‌, తెన్నరసు, సంపత్‌కుమార్‌, ముహమ్మద్‌ పర్వేజ్‌, శరత్‌కుమార్‌, మరియ విల్సన్‌, విఘ్నేష్‌, కాంగ్రెస్‌కు చెందిన రాజేష్‌కుమార్‌, విశ్వనాథన్‌లతో కూడిన 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు సాయంత్రం వీసీకే, ఐయూఎంఎల్‌ పార్టీలు కూడా ప్రభుత్వంలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో, ఆ పార్టీలకు చెందిన ఇద్దరికి శుక్రవారం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. సీపీఎం, సీపీఐలు టీవీకే ఆహ్వానాన్ని తిరస్కరించాయి. ఇక, అన్నాడీఎంకేకు చెందిన 25 తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి కేటాయించ లేదు.

Advertisement
 
Advertisement
Advertisement