సాక్షి, చైన్నె: కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అమల్‌రాజ్ శుక్రవారం వేపేరిలోని కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అమల్‌రాజ్ 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, సేలం జిల్లాల్లో శాంతిభద్రతల విభాగంలో పనిచేసిన అపార అనుభవం ఈయనకు ఉంది. గతంలో తాంబరం కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఈయన విశిష్ట సేవలకుగాను రాష్ట్రపతి పతకాన్ని కూడా అందుకున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ చైన్నె నగరంలో రౌడీయిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే తన మొదటి ప్రాధా న్యత అని అన్నారు.
మట్టి చరియలు పడి ఇద్దరి మృతి
సాక్షి, చైన్నె : మదురైలో నిర్మాణంలో ఉన్న ప్రదేశంలో మట్టి చరియలు విరిగి పడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. మదురై సులైమాన్ ప్రాంతంలో చిన్నస్వామి అనే వ్యక్తి సంబంధించిన స్థలంలో కల్యాణ మండపం, సినిమా థియేటర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాంక్రీట్ పనుల నిమ్తితం పెద్ద ఎత్తున గుంతలు ఇక్కడ తవ్వారు. శుక్రవారం ఇక్కడ పది మందికి పైగా కార్మికులు పనుల్లో ఉన్నారు. ఈసమయంలో హఠాత్తుగా మట్టి చరియలు విరిగి పడడంతో ఇద్దరు మహిళా కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించడం కష్టతరంగా మారింది. మిగిలిన వారందరూ తప్పించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అతికష్టంపై శ్రమించి ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికి తీశారు. వీరు ఆ ప్రాంతానికి చెందిన ధనలక్ష్మి(40), లక్ష్మి(60)గా గుర్తించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
ప్రత్యేక చిహ్నంతోనే పోటీ
సాక్షి, చైన్నె: రానున్న ఎన్నికల్లో తాము ప్రత్యేక చిహ్నంతోనే పోటీ చేయనున్నామని మనిదనేయమక్కల్ కట్చి ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం జరిగిన ఆ పార్టీ సమావేశంలో తీర్మానించారు. మనిదనేయ మక్కల్ కట్చి అధ్యక్షుడు, ప్రొఫెసర్ ఎం.హెచ్. జవహిరుల్లా అధ్యక్షతన ఆ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఉదయం జరిగింది. ఇందులో మూడు ముఖ్య తీర్మానాలు ఆమోదించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థుల విజయం కోసం కష్టపడిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కూటమి తరఫున నాగపట్టణం, మనప్పారై నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, సహకరించిన మిత్రపక్షాల నాయకులకు, ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనిదనేయ మక్కల్ కట్చి పార్టీ మిత్రపక్షాల గుర్తులపై కాకుండా, తమ సొంత గుర్తుపైనే (ప్రత్యేక చిహ్నం) పోటీ చేయాలని తీర్మానించారు.
కూటమి ప్రభుత్వం
సాధ్యం కాదా?
సాక్షి, చైన్నె : తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ సాధ్యం కాదు అని మాట్లాడిన మాటలన్నింటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గట్టి సమాధానం ఇచ్చిందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విస్వనాథన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో మళ్లీ ‘కామరాజర్ పాలన’ను తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కలగా పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కాలంలో కూడా ఆ కల నెరవేరలేదని, తర్వాత సోనియా గాంధీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది సాధ్యపడలేదన్నారు. అయితే, ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, ఒక బలమైన కూటమి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలిగారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కాంగ్రెస్ తరఫున బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు మంత్రులం ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పని చేస్తామనే మంచి పేరును సంపాదిస్తామన్నారు. ‘రాజకీయాల్లో విమర్శలు సహజమని, వాటిని స్వీకరిస్తామని, కానీ దిగజారుడు విమర్శలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కనబెడుతుందన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం, ఉన్నత స్థానాలకు చేరుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తుందన్నారు.


