సాక్షి, చైన్నె: చైన్నెతోపాటు పొరుగు జిల్లాలైన చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురంలలో విద్యుత్ కష్టాలు విస్తృతమయ్యాయి. గంటల తరబడి విచ్చలవిడిగా అమలవుతున్న విద్యుత్ కోతలు కలకలం రేపుతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు, అర్ధరాత్రి వేళల్లో గంటల కొద్దీ కరెంట్ నిలిచిపోతుండంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించడంలో విద్యుత్ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గురువారం రాత్రి మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రజా నిరసనలు చెలరేగాయి.
నరకప్రాయంగా మారిన రాత్రులు
తీవ్రమైన ఉక్కపోత కారణంగా ఇళ్లలో ఉండలేక చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు నిద్రలేమితో అల్లాడిపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కరెంట్ ఆఫీసులకు ఫోన్ చేస్తే అధికారులు కనీసం సమాధానం ఇవ్వడం లేదని, కొన్నిచోట్ల ఫోన్ కనెక్షన్లను కూడా కట్ చేశారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ముందే తెలిసినప్పటికీ, విద్యుత్ బోర్డు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ప్రజలు మండిపడుతున్నారు
చైన్నెలో అర్ధరాత్రి రాస్తారోకోలు
కొలత్తూరు, పెరంబూరు పరిధిలోని రాజమంగళం ప్రజలు అర్ధరాత్రి సమయంలో రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. తిరువొత్తియూర్– రాయపురం పరిసరాల్లోని విమ్కోనగర్, భరత్ నగర్, అంబేడ్కర్ నగర్ ప్రాంతాలలో జనం విద్యుత్ బోర్డు కార్యాలయాన్ని దిగ్బంధించారు. రాయపురం, కాసిమేడు, ఆర్కేనగర్ పరిధిలో గంటల పాటు కరెంట్ లేకపోవడంతో తాగునీటి సరఫరా సైతం పూర్తిగా నిలిచిపోయి ప్రజలు నీటి కోసం వీధుల్లోకి వచ్చారు. చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో పరిధిలోని పరిశ్రమలకు పూర్తి స్థాయిలో ఓల్టేజీతో కూడిన విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొనడంతో జనరేటర్లను వినియోగించక తప్పలేదు. ఉత్తర చైన్నెపరిధిలోని రాయపురంలో అయితే, టీవీకే ఎమ్మెల్యే విజయ్‌దాము ఇంటిని ముట్టడించడం గమనార్హం. ఈ విద్యుత్ కోతలపై మాజీ మంత్రి శివశంకర్ తీవ్రంగా స్పందించారు. పవర్ ప్రజలు చేతికి ఇచ్చారని, అయితే, పూర్తి స్థాయిలో పవర్ అన్నది ప్రజలకు ఇవ్వలేని దుస్థితిలో ఈపాలకులు ఉన్నారని మండిపడ్డారు. ఎండలు మండుతున్న సమయంలో పలు జిల్లాలలో జనం ఉక్కపోతకు గురవుతున్నారు. పలు జిల్లాల్లో 100–107 ఫారిన్ డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది. మున్ముందు విద్యుత్ అవసరం రోజుకు 22 వేల మెగావాట్లను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.


