పదవుల కోసం మద్దతు ఇవ్వలేదు | - | Sakshi
Sakshi News home page

పదవుల కోసం మద్దతు ఇవ్వలేదు

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

●ఎస్‌.పి. వేలుమణి ●తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామియే ●అన్నాడీఎంకేలో కొత్త ట్విస్టు

సాక్షి, చైన్నె : ఎడపాడి పళనిస్వామే జనరల్‌ సెక్రటరీ , పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే తాము డిమాండ్లు ఉంచాం. అన్నాడీఎంకేలోఎటువంటి చీలిక లేదు, కేవలం కొన్ని అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి’ అని మాజీ మంత్రి, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న అన్నాడీఎంకే సీనియర్‌ నేత ఎస్‌.పి. వేలుమణి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు అన్నాడీఎంకే రాజకీయ వివాదంలో కొత్త ట్విస్టుకు దారి తీసింది.

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 25 మంది ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఆజ్ఞలను అసెంబ్లీ వేదికగా ధిక్కరించిన విషయం తెలిసిందే. వీరంతా టీవీకే ప్రభుత్వ సీఎం విజయ్‌కు విశ్వాస పరీక్ష సమయంలో తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకేలో విభేదాలు భగ్గుమన్నాయి. అన్నాడీఎంకే శాసన సభా పక్షనేత విషయంగా ఓ వైపు సీనియర్‌ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరం, మరో వైపు పళణి స్వామి శిబిరం స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ వద్ద పంచాయతీ పెట్టాయి. దీంతో అన్నాడీఎంకే మళ్లీ ముక్కలైనట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చట్టపరంగా చర్యలకు పళణిస్వామి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు టీవీకే మంత్రి వర్గంలో చోటు దక్కక పోవడం తాజాగా కొత్త ట్విస్టుకు దారి తీశాయి. పళణి స్వామిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన ఎస్పీ వేలుమణి శుక్రవారం కొత్త పంథాను అనుసరించే పనిలో పడ్డారు. చైన్నెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలకు వివరణ ఇచ్చారు. అయితే, ఈ సారి విలేకరుల సమావేశంలో సీవీ షణ్ముగం కనిపించక పోవడం గమనార్హం. మంత్రి పదవుల కోసమే తాము టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామనే వార్తల్లో నిజం లేదన్నారు.

మద్దతుకు కారణాలు:

ప్రజలు టీవీకే పార్టీకి తమ మద్దతును అందించారని, డీఎంకే పార్టీని మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకించింది అన్నాడీఎంకే మాత్రమేనని, ప్రస్తుత టీవీకే వ్యూహం కూడా డీఎంకేకు వ్యతిరేకంగానే ఉందని వివరించారు. దీంతోపాటు, గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలనే ఉద్దేశంతోనే తాము వారికి మద్దతు ఇచ్చామన్నారు.

పార్టీలో విభేదాలపై స్పందన

తమకు ఎడపాడి పళనిస్వామే ఎప్పటికీ ప్రధాన కార్యదర్శి అని స్పష్టంచేశారు. కొందరు తమ మధ్య లేనిపోని విభేదాలు సృష్టిస్తూ, తప్పుడు వార్తలతో తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపై త్వరలోనే పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. తమిళనాడులో మళ్లీ అమ్మ పాలన రావాలనేదే లక్ష్యమని, దయచేసి తమపై తప్పుడు ప్రచారాలు చేయకండని వేలుమణి మీడియాకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement