తిరుత్తణి : తిరుత్తణి ప్రాంతంలో మండుటెండలు ప్రజలను అల్లాడిస్తుండగా గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వీచిన బలమైన గాలుల కారణంగా చెట్లు కూకటివేళ్లతోసహా పెకిలించబడి ఇళ్లపైనా, విద్యుత్ స్తంభాలపైన కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగి, ప్రజలకు తీవ్ర ఇబ్బంది కల్గింది. తిరుత్తణి, పరిసర ప్రాంతాలు మూడు నెలలుగా మండుటెండలతో అల్లాడుతున్నాయి. ఈ పరిస్థితిల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలు, వేడి గాలులు కొనసాగాయి. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. గాలి బీభత్సానికి, తిరుత్తణి అమృతపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లే రహదారిపై ఉన్న ఒక ఇంటిపై వందేళ్ల నాటి మర్రిచెట్టు వేళ్లతో సహా కూలిపోయింది. దీంతో ఆ ఇల్లు, సమీపంలోని మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. అయితే, ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే, ఆ ప్రాంత డీఎంకే నగర కౌన్సిలర్ మహేశ్వరి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించగా, విద్యుత్ అంతరాయం కారణంగా కూలిపోయిన చింతచెట్టును మున్సిపల్ కార్మికులు తొలగించారు. తిరుత్తణి నుంచి ఆర్‌కే పేటకు వెళ్లే రాష్ట్ర రహదారిలోని అకూర్ ప్రాంతంలో, గాలి వేగం కారణంగా 4 చింతచెట్లు వేళ్లతో పెకిలించబడి రోడ్లపై కూలిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రహదారి శాఖ అధికారులు వెంటనే ప్రొక్‌లైన్ యంత్రం సాయంతో రోడ్డుపై వృక్షాలను తొలగించారు. చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలోని నెడుంబరం ప్రాంతంలో, గాలి కారణంగా అటుగా వెళ్తున్న కారుపై ఒక చెట్టు కూలింది. అయితే, కారులోని ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే ప్రొక్‌లైనర్‌తో కారుపై పడిన చెట్టును తొలగించారు. కనకమ్మసత్రం ప్రాంతంలో, జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక రేకుల టెంట్లలో ఉత్తర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారు. వారు బస చేస్తున్న గుడారాలు గాలి వేగానికి కొట్టుకుపోయి రోడ్డుపైన, వ్యవసాయ భూములపైనా పడిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై అరగంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుత్తణి చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు విరిగి దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది.
కూలిన వృక్షాలు
కూలిన కరెంటు స్తంభాలు


