నారాయణగిరి షెడ్ల వద్ద క్యూలో కిక్కిరిసిన భక్తులు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం తీవ్ర స్థాయికి చేరుకుంది. శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు శిలాతోరణం దాటి గోగర్భం డ్యామ్ ప్రాంతం వరకూ కొనసాగడం చూస్తే భక్తుల తాకిడి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక, బుధవారం అర్ధరాత్రి వరకు మొత్తం 86,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 44,107 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ పరంగా రూ.3.94 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం తిరుమలలో సాధారణ సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతోంది. మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు సుమారు మూడు గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు పొందిన వారికి మాత్రం నిర్దేశిత సమయానికే దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికే క్యూలలోకి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అధిక రద్దీ కారణంగా క్యూల వద్ద భక్తులను దశలవారీగా మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ లడ్డూ పంపిణీ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తోంది. లడ్డూ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే కౌంటర్ల వద్దకు అనుమతిస్తున్నారు. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుమలలో వసతి సమస్య తీవ్రరూపం దాల్చింది. టీటీడీ అతిథి గృహాలు, కాటేజీలు, మఠాలు మాత్రమే కాకుండా వెయింటిగ్ హాళ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి.
తిరుమలలోని పాచికాలవ గంగమ్మ గుడి ఆలయం నుంచి నారాయణగిరి షెడ్ల వరకు క్యూలలో వేచి ఉన్న భక్తులు.. క్యూలోకి ప్రవేశిస్తున్న భక్తులు


