కోర్టు ఆదేశాలతో మృతదేహాలను వెలికితీసి.. | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఆదేశాలతో మృతదేహాలను వెలికితీసి..

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

● మరో శ్మశానంలో ఖననం ● ఉలుందైలో తీవ్ర ఉద్రిక్తత

తిరువళ్లూరు: హైకోర్టు ఆదేశాల మేరకు ఓ ప్రాంతంలో పాతిపెట్టిన మూడు మృతదేహాలను వెలికితీసి ఉద్రిక్తతత నడుమ మరో శ్మశానంలో అధికారులు దహనక్రియలు నిర్వహించిన ఘటన తిరువళ్లూరు సమీపంలో తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. కడంబత్తూరు యూనియన్‌ ఉలుందై గ్రామ పంచాయతీ పరిధిలోని వడువూరు కాలనీ ఉంది. ఈ గ్రామం తిరువళ్లూరు జిల్లా పరిధిలోకి వస్తుండగా, కాంచీపురం జిల్లా సరిహద్దుకి సమీపంలో ఉంది. ఇక్కడ సుమారు 30 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఎవరైనా మృతి చెందితే సమీప ప్రాంతంలోకి శ్మశానంలో దహన క్రియలను నిర్వహించే వారు. అయితే శ్మశానం వున్నప్రాంతం కాంచీపురం జిల్లా కీళాయి గ్రామానికి పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దహనక్రియలు నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపంలో అదే ప్రాంతానికి చెందిన చక్రవర్తి అనే రైతుకు 5 ఎకరాల పొలం వుంది. సంబంధిత పొలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పొలానికి సమీపంలో దహనవాటిగా ఉపయోగిస్తున్న ప్రాంతం కాంచీపురం జిల్లా కీళాయి పరిధిలోకి వస్తుందని, దీంతో పాటు శ్మశాన వాటిక ఉన్న ప్రాంతం నీటి ఆధారిత కాలువ కావడంతో అక్కడ మృతదేహాలను పూడ్చడానికి అనుమతించవద్దని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. ఈక్రమంలో తక్షణం అక్కడ వున్న మృతదేహాలను వెలికి తీసి తిరువళ్లూరు జిల్లా పరిధిలోని శ్మశానంలో పూడ్చాలని కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. అదే విధంగా వడవూరు గ్రామానికి చెందిన ప్రజలకు శాశ్వత శ్మశాన వాటికకూ స్థఽలం కేటాయించాలని ఆదేశించారు.

ఉద్రిక్తత నడుమ

హైకోర్టు ఆదేశాల ఆదేశాల మేరకు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాకు చెందిన అధికారులు ఉలుందై గ్రామానికి గురువారం ఉదయం చేరుకున్నారు. శ్రీపెరంబదూరు సబ్‌కలెక్టర్‌ నల్లశివం, డీఎస్పీ కీర్తీవాసన్‌, తాహసీల్దార్‌ వసంతి తిరువళ్లూరు ఆర్డివో రవిచంద్రన్‌, తహసీల్దార్‌ బాలాజీ, ఇన్‌స్పెక్టర్‌ శీతాపతి నేతృత్వంలోని అధికారులు చేరుకున్నారు. గ్రామస్తుల వ్యతిరేకత మధ్యే మూడు మృతదేహాలను వెలిసి తీశారు. దీంతో స్థానికులకు, పోలీసులకు మద్య తీవ్ర ఉద్రిక్తత వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తత నడుమ మూడు మృతదేహాలను వెలిసి తీసి ఉలుందై గ్రామంలోని మరో శ్మశాన వాటికకూ తరలించారు.

వాహనాన్ని అడ్డుకుని నిరసన

వడవూరు గ్రామానికి చెందిన మృతదేహాలను వెలికితీసి మూడుకిలోమీటర్‌ దూరంలో ఉన్న ఉలుందై కాలనీలోని శ్మశానంలో దహనం చేయడానికి వాహనంలో తరలించారు. అయితే విషయం తెలుసుకున్న ఉలుందై గ్రామానికి చెందిన ప్రజలు మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ను అడ్డుకుని నిరసన చేపట్టారు. ఎక్కడో తీసిన మృతదేహాలను తమ గ్రామంలో పూడ్చవద్దని కోరుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆదేశాలు వున్నందన తామేమీ చేయలేమని ఆందోళకారులను పక్కకు నెట్టి వడవూరులో వెలికితీసిన మృతదేహాలను ఉలుందైలోని స్మశానంలో దహనక్రియలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement