సాక్షి, చైన్నె : భారతీయ వైద్యరంగంలో చైన్నెకి చెందిన ప్రముఖ ఆసుపత్రి ఎంజీఎం హెల్త్‌కేర్ సరికొత్త మైలురాయిని సృష్టించింది. తీవ్రమైన గుండె వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 80 ఏళ్ల వృద్ధుడికి అత్యంత అధునాతన లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్(ఎల్‌వీఏడీ) అనే మెకానికల్ హార్ట్ పంప్‌ను విజయవంతంగా అమర్చారు. ఇంతటి వృద్ధాప్యంలో ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడం ఇదే ప్రపథమం అని ఎంజీఎం హెల్త్‌కేర్ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి విభాగం అధిపతి డాక్టర్ కె.ఆర్. బాలకృష్ణన్, కో–డైరెక్టర్ డాక్టర్ సురేష్ రావు వివరించారు. చైన్నెకి చెందిన సదరు రిటైర్డ్ ఉద్యోగి (80) గత కొంతకాలంగా గుండె చివరి దశ వైఫల్యంతో బాధపడుతున్నారని తెలిపారు. గుండెలోని ఎడమ జఠరిక శరీరాంతరానికి రక్తాన్ని పంపింగ్ చేయలేకపోవడంతో ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. లంగ్స్ (ఊపిరితిత్తులు) లో నీరు చేరడం, కిడ్నీల పనితీరు క్షీణించడం, లో–బీపీ వంటి మల్టీ–ఆర్గాన్ సమస్యలు ఎదురయ్యాయని వివరించారు. రోగి వయసు 80 ఏళ్లకు దగ్గరగా ఉండటం, శరీరం చాలా బలహీనంగా మారడం , కిడ్నీలు దెబ్బతినడం వల్ల వైద్యులు గుండె మార్పిడి చికిత్సను నిరాకరించారు. దీనికి ప్రత్యామ్నాయంగా గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచే మెకానికల్ పంప్(ఎల్‌వీడీ)ని అమర్చాలని నిర్ణయించారు. ఈ అరుదైన, అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను వైద్యుల బృందం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం మూడు వారాల పాటు ఆసుపత్రిలో కోలుకున్న రోగిని సురక్షితంగా డిశ్చార్జ్ చేశామన్నారు.


