సాక్షి, చైన్నె: తమిళనాడు వైద్య , గ్రామీణ సంక్షేమ సేవల డైరెక్టరేట్ ఉపయోగం కోసం రూ. 2.90 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 40 కొత్త వాహనాలను సీఎం జోసెఫ్ విజయ్ ప్రారంభించారు. బుధవారం చైన్నెలోని సెక్రటేరియట్ (సచివాలయం) వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం విజయ్ వాహనాల తాళాలను డ్రైవర్లకు అందజేసి, జెండా ఊపి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. స్వయంగా వాహనాన్ని నడిపి అందర్నీ ఆశ్చర్య పరిచారు. జిల్లా స్థాయిలో వైద్య సేవల పర్యవేక్షణను మరింత ముమ్మరం చేసేందుకు ఈ అధునాతన వాహనాలను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, స్కాన్ సెంటర్లలో ప్రీ–నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టం 1994 ప్రకారం గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి, తమిళనాడు ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1997 నిబంధనల ప్రకారం అన్ని వైద్య సంస్థలు సక్రమంగా నమోదై నడుస్తున్నాయా లేదా అని పర్యవేక్షించడానికి, రాష్ట్రంలో ఎక్కడైనా నకిలీ వైద్యులు (రెక్ లెస్ క్వాక్స్) ఉన్నట్లు సమాచారం అందితే, తక్షణమే అక్కడికి చేరుకుని విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, విపత్తు సమయాల్లో అత్యవసర సేవలు పర్యవేక్షణకు ఈ వాహనాలు ఉపయోగకరంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో తమిళనాడు వైద్య , ప్రజా సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కె.జి. అరుణ్‌రాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ , ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ థారేజ్ అహ్మద్ , అదనపు కార్యదర్శి డాక్టర్ ఎస్. ఉమ , గ్రామీణ సంక్షేమ సేవల డైరెక్టర్ డాక్టర్ చిత్ర పాల్గొన్నారు.
ప్రత్యేక విభాగంలో హడావిడి
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జోసెఫ్ విజయ్ తొలిసారిగా తనిఖీలు నిర్వహించనున్న సమాచారంతో రాత్రికి రాత్రే అధికారులు ప్రత్యేక విభాగం రూపు రేఖల్ని మార్చేశారు. చైన్నెలోని ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగం (ప్రజల నుండి నేరుగా వినతిపత్రాలు స్వీకరించే కీలక శాఖ) కార్యాలయాన్ని రాత్రికి రాత్రే హడావిడిగా కంప్యూటర్లు, పరికరాలను తనిఖీ చేసి, శుభ్రం చేసి కొత్త లుక్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి వస్తారని పాత్రికేయులు, అధికారులు గంటల తరబడి ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ చివరి నిమిషంలో ఆయన రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అయితే ఆయన రాకపోయినా కార్యాలయం మాత్రం కొత్త రూపాన్ని సంతరించుకుంది.
అయోధ్యీదాసర్‌కు నివాళి
ద్రవిడ ఉద్యమ ఆద్యుడు, సామాజిక విప్లవకారుడు పండిత అయోధ్యీదాసర్ 181వ జయంతిని పురస్కరించుకుని తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఆయనకు ఘన నివాళులర్పించారు. బుధవారం ఉదయం చైన్నె గిండిలోని గాంధీ మండపం ప్రాంగణంలో ఉన్న అయోధ్యీదాసర్ విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు. అయోధ్యీదాసర్ జీవిత విశేషాలు , సేవలను గుర్తు చేశారు. సామాజిక సంస్కర్త మాత్రమే కాకుండా.. ఒక అద్భుతమైన రచయిత, పరిశోధకుడు, చరిత్రకారుడు, ప్రసంగీకుడు, బహుభాషా కోవిదుడు నిపుణుడైన సిద్ధ వైద్యుడు , సమాజంలో కుల నిర్మూలన, సామాజిక విముక్తి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు. ఈ నివాళిలో సీఎం విజయ్‌తో పాటూ మంత్రులు ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, సెంగోట్టయన్, వెంకటరమణన్, నిర్మల్‌కుమార్, రాజ్ మోహన్, టికే ప్రభు పాల్గొన్నారు.


