సాక్షి, చైన్నె : తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వంలో చేరాలని మద్దతు ఇస్తున్న పార్టీలను టీవీకే ప్రభుత్వం ఆహ్వానించడం చర్చకు దారి తీసింది. వివరాలు.. ప్రభుత్వం ఏర్పాటుతో విజయ్‌తో సహా కేవలం 10 మంది మాత్రమే కేబినెట్‌లో ఉన్నారు. ఖాళీగా ఉన్న మిగిలిన శాఖల భర్తీ కోసం విస్తరణ కసరత్తు జరుగుతున్నట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుతం టీవీకే ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇందులో 106 మంది టీవీకే ఎమ్మెల్యేలు కాగా, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు 25 మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ 5, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్‌లకు చెందిన తలా ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగంలు మంత్రి పదవులు ఆశిస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అయితే, వీరికి పదవులు ఇస్తే మద్దతుపై పునరాలోచించాల్సి ఉంటుందని సీపీఎం నేత షణ్ముగం హెచ్చరించడం గమనార్హం. వాస్తవానికి ఈ 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలలో 12 మంది పదవీ ఆశతో ఉన్నట్టు, వీరిలో ఏడుగురికి విజయ్ అవకాశం ఇవ్వవచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే వీరికి పదవులు ఇస్తే చట్టపరమైన చిక్కులు వచ్చి పడుతాయన్న ఆందోళన తప్పడం లేదు.
అనర్హత వేటు భయం
పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేసినందుకు గానూ, ఆ 25 మందిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వర్గం స్పీకర్‌కు , గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించి ఉన్నాయి. చట్టపరమైన సమస్యలు , పార్టీ ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంలో వేలుమణి బృందానికి మంత్రి పదవులు ఇచ్చేందుకు తాత్కాలిక గవర్నర్ నిరాకరించినట్లు సమాచారం. లోక్‌భవన్‌కు వచ్చిన జాబితాలో తిరుగుబాటు ఎమ్మెల్యేల పేర్లు చూసి వెనక్కి పంపించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం నేపథ్యంలో అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదన్న సమాచారాలు వెలువడ్డాయి. తాము అస్సలు మంత్రి పదవులు ఆశించ లేదంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేల ఒకరైన లీమా రోజు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదే సమయంలో మంత్రి ఆధవ్ అర్జున ఇచ్చిన పిలుపు కొత్త చర్చకు దారి తీసింది. తమకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్‌లు మంత్రి వర్గంలోకి రావాలని ఆయన పిలుపు నివ్వడం గమనార్హం.
కాంగ్రెస్‌కు రెండు బెర్తులు ఖరారు
విజయ్ మంత్రివర్గంలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు 2 మంత్రి పదవులు దక్కడం ఖాయమైంది.కన్యాకుమారి జిల్లాకు చెందిన రాజేష్ కుమార్ లేదా తారకై కాఠ్‌పత్, అలాగే విశ్వనాథన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తమకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది పక్కన పెడితే, టీవీకే పార్టీ తరపున కొత్తగా 10 నుండి 12 మందిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందన్న సమాచారం వెలువడింది. ఇందులో అంబత్తూరు బాలమురుగన్, కల్లనై (మదురై నార్త్), పార్థిబన్ (సేలం సౌత్), మహమ్మద్ పర్వేజ్ (అరంతంగి),విజయ శరవణన్ (తంజావూరు),సంపత్ కుమార్ (కోయంబత్తూరు నార్త్), సత్యబామ (తిరుప్పూర్ నార్త్), కామాక్షి (పల్లవరం) పేర్లు తెరమీదకు వచ్చాయి. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ నుంచి రాత్రి చైన్నెకు చేరుకున్నారు.దీంతో విజయ్ కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు సమర్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లోక్ భవన్‌లో గురువారం ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు సైతం సాగుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.


