క్రీడాకారులు.. ఉన్నత విద్యను పూర్తి చేయాల్సిందే..! | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులు.. ఉన్నత విద్యను పూర్తి చేయాల్సిందే..!

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

● క్రీడాశాఖ మంత్రి ఆధవ్‌ అర్జున పిలుపు

సాక్షి, చైన్నె : క్రీడాకారులు కేవలం ఆటలకే పరిమితం కాకుండా ఉన్నత విద్యను కచ్చితంగా పూర్తి చేయాలని, అప్పుడే క్రీడా కోటా కింద ఉద్యోగాలు పొందేటప్పుడు ఉన్నత స్థాయి అధికారి పోస్టులను ఎంపిక చేసుకోవడానికి వీలవుతుందని ప్రభుత్వ ప్రజాపనులు, క్రీడా శాఖ మంత్రి శ్రీ ఆధవ్‌ అర్జున పేర్కొన్నారు. పుదుచ్చేరిలో ఈ నెల 22 నుండి 29 వరకు జరగనున్న ఆల్‌ ఇండియా అండర్‌–18 జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనబోయే తమిళనాడు జూనియర్‌ పురుషుల, మహిళల బాస్కెట్‌బాల్‌ జట్లు బుధవారం చైన్నెలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో మంత్రిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ‘మిమ్మల్ని చూస్తుంటే నా పాత బాస్కెట్‌బాల్‌ శిక్షణ రోజులు గుర్తొస్తున్నాయి. నేను కూడా మీలాగే ఒకప్పుడు క్రీడా హాస్టల్‌ విద్యార్థిగా, బాస్కెట్‌బాల్‌ ఆటగాడిగా ఉండి.. కష్టపడి చదివి, కఠిన శ్రమతో ఎదిగి ఈరోజు మీ ముందు క్రీడాశాఖ మంత్రిగా నిలబడ్డాను అని వ్యాఖ్యలు చేశారు. క్రీడల్లో రాణించడమే కాకుండా చదువుపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. క్రీడా ప్రాక్టీస్‌ ముగిసిన తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుని, వెంటనే చదువుపై శ్రద్ధ పెట్టాలని, ఆత్మవిశ్వాసంతో ఆడి కోచ్‌లకు, తల్లిదండ్రులకు, తమిళనాడు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే విద్యార్థులు ఆడే మ్యాచ్‌లను తాను స్వయంగా వచ్చి వీక్షిస్తానని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా శాఖ ప్రభుత్వ కార్యదర్శి సజ్జన్‌సింగ్‌ ఆర్‌. చవాన్‌ , క్రీడా అభివృద్ధి అథారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement