యూట్యూబర్‌ శంకర్‌పై గుండా యాక్ట్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

యూట్యూబర్‌ శంకర్‌పై గుండా యాక్ట్‌ రద్దు

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

● తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు

● తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, చైన్నె:తమిళనాడులో ప్రముఖ యూట్యూబర్‌, సామాజిక విశ్లేషకుడు సవుక్కు శంకర్‌ పై విధించిన గుండా చట్టాన్ని రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని స్పష్టం చేసింది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతి అక్రమాలు, అధికారిక దుర్వినియోగాలపై సవుక్కు శంకర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వరుస వీడియోలు చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయనపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ప్రతిసారీ ఆయన కోర్టు నుండి బెయిల్‌ పొందుతూ వస్తుండటంతో, గత ఏప్రిల్‌ 9వ తేదీన అప్పటి చైన్నె సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు శంకర్‌పై ’గుండా యాక్ట్‌’ ప్రయోగించి పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ప్రభుత్వ ఉత్తర్వులు ..

సవుక్కు శంకర్‌ను గుండా యాక్ట్‌ కింద ముందస్తు నిర్బంధంలో ఉంచడానికి గల కారణాలను ప్రభుత్వం అడ్వైజరీ బోర్డు (సలహా మండలి) ముందు సమర్పించారు. ఈ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన సలహా మండలి, శంకర్‌ను గుండా చట్టం కింద జైల్లో ఉంచడానికి సరైన లేదా తగిన ఆధారాలు, కారణాలు లేవని తేల్చి చెప్పింది. అడ్వైజరీ బోర్డు నివేదిక ఆధారంగా ఆయనపై ఉన్న గుండా చట్టం నిర్బంధాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ కేసు పరంగా ఆయనను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల కాపీలను చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనర్‌, పుళల్‌ కేంద్ర జైలు సూపరింటెండెంట్‌, అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌, పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌, జైళ్ల శాఖ డీజీపీలకుపంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement