సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే పార్టీ అధికారిక దినపత్రికగా ‘పోర్వాళ్’( యుద్ధఖడ్గం)ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి బుధవారం ఆవిష్కరించారు. చైన్నెలోని తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పత్రికకు సంబంధించిన మొదటి ప్రివ్యూ ప్రతిని ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.పి. మునుస్వామి, మాజీ మంత్రులు ఎన్. దళవాయి సుందరం, ఓ.ఎస్. మణియన్, రాజేంద్ర బాలాజీ, అగ్రి కృష్ణమూర్తి, లాయర్ వింగ్ సెక్రటరీ ఇన్బదురై సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
పత్రిక విడుదల వెనుక అసలు కథ ఇదే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి 53 స్థానాల్లో విజయం సాధించగా, అందులో అన్నాడీఎంకే ఒంటరిగా 47 స్థానాలను గెలుచుకుంది. అయితే ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని ప్రస్తుత పరిస్థితుల్లో.. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సమయంలో అన్నాడీఎంకేకు చెందిన సీనియర్ నేతలు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం నాయకత్వంలోని 25 మంది ఎమ్మెల్యేలు అనూహ్యంగా ’తమిళగ వెట్రి కళగం’ పార్టీకి మద్దతుగా ఓటు వేశారు. ఈ పరిణామంతో అన్నాడీఎంకేలో మళ్లీ తీవ్రమైన అంతర్గత సంక్షోభం మొదలైంది.
‘నమదు అమ్మ’ స్థానంలో ‘పోర్వాళ్’
ఇప్పటివరకు అన్నాడీఎంకే అధికారిక పత్రికగా ‘నమదు అమ్మ’ చలామణిలో ఉండేది. అయితే, ప్రస్తుత పార్టీ సంక్షోభంలో ఆ పత్రిక ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్న తిరుగుబాటు నేతలు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగంవర్గం గుప్పెట్లోకి చేరింది. ఈ నేపథ్యంలోనే తన పట్టును నిలుపుకోవడానికి , తన వర్గం వాదనలను, పార్టీ నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి పళణి ‘పోర్వాళ్’ అనే సరికొత్త పత్రికను రంగంలోకి దించారు. ఇకపై ఎడప్పాడి పళనిస్వామి అధికారిక కార్యక్రమాలు, ఆయన వర్గం వార్తలు ఈ కొత్త పత్రికలో ప్రముఖంగా ప్రచురితం కానున్నాయి.


