వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీ, పునే బజాజ్ ఆటో ఫౌండేషన్ మధ్య ఇంజినీరింగ్‌లో డిప్లొమా పట్టభద్రులు, ఆఖరి సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అందజేసేందుకు ఇటీవల పరస్పర ఒప్పందం జరిగింది. వీటి ద్వారా బజాజ్ ఇంజినీరింగ్ ఆటో ఫౌండేషన్ శిక్షణ కేంద్రం వీఐటీ ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. వీఐటీలో శిక్షణ కేంద్రం రూ.15 కోట్లతో ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పరికరాలు, ఈ మొబిలిటి వంటి విభాగాల్లో అవసరమైన శిక్షణ అందజేసేందుకు అతి నవీన వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. వీఐటీ మెకానికల్ ఇంజినీరింగ్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ వంటి విభాగాలకు చెందిన విద్యార్థులు ఈ కేంద్రం ద్వారా లబ్ధి పొందనున్నారు. చాన్సలర్ విశ్వనాథన్ విడుదల చేసిన ప్రకటనలో..విద్యార్థుల మేధాశక్తిని పెంచేందుకు ప్రాక్టికల్‌కు వీఐటీ అధిక ప్రాదాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుతం రూ.15 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ కేంద్రం విద్యార్థులకు అవసరమైన అతి నూతన శిక్షణను అందజేసి వీఐటీ విద్యార్థుల మేధాశక్తిని పెంచి వారిని అభివృద్ధి చేస్తుందన్నారు. ఈసందర్భంగా బజాజ్ ఆటో ఫౌండేషన్ సీఎస్‌ఆర్ చైర్మన్ రమేష్, ఉపాధ్యక్షుడు సుధాకర్ కుడిబది, వీఐటీ ఉపాధ్యక్షుడు శంకర్ విశ్వనాఽథన్, శేఖర్ విశ్వనాథన్, కార్యనిర్వహణ డైరెక్టర్ సంధ్యాపెంటారెడ్డి, అసిస్టెంట్ ఉపాధ్యక్షులు కాదంబరి, వైస్ చాన్స్‌లర్ కాంచన, ప్రొ.చాన్స్‌లర్ పార్థసారథి మల్లిక్, రిజిస్ట్రార్ జయభారతి పాల్గొన్నారు.


