సాక్షి, చైన్నె: తమిళనాడు పాఠశాల విద్య, తమిళ అభివద్ధి, సమాచార శాఖ మంత్రి రాజ్‌మోహన్ బుధవారం చైన్నె కోటూర్‌పురంలోని ప్రతిష్టాత్మక అన్నా శతాబ్ది గ్రంథాలయం ప్రాంగణాన్ని సందర్శించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బుధవారం జరిగిన ఈ తనిఖీల్లో గ్రంథాలయ మౌలిక వసతులు, వివిధ విభాగాల పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే గ్రంథాలయ ప్రాంగణంలోని కళామందిరం (కలైయరంగం), సమావేశ మందిరం (కూట్టరంగం), సదస్సుల హాల్ (కరుత్తరంగం) , ‘సెంథమిళ్ శిల్పుల’ ఆడిటోరియంలను మంత్రి స్వయంగా సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న వసతులను, సాంకేతిక ఏర్పాట్లను సమీక్షించారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకులు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల (కల్పిడ వసతి) నిర్వహణ ఎలా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. గ్రంథాలయ ఆవరణలోని ‘ఆవిన్’ మిల్క్ పార్లర్‌ను సందర్శించిన మంత్రి రాజ్‌మోహన్, అక్కడ పాలు తాగి నాణ్యతను పరీక్షించారు. అదే సమయంలో అక్కడ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు, పాఠకులతో కాసేపు ముచ్చటించి, గ్రంథాలయంలో ఇంకా ఎలాంటి వసతులు కావాలో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో మంత్రి వెంట పాఠశాల విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్ర మోహన్, ఉపాధ్యాయ నియామక బోర్డు చైర్మన్ ఎస్. జయంతి ఉన్నారు.


