పళ్ళిపట్టు: పళ్లిపట్టులో గంగజాతర వేడుకలు సందర్భంగా మంగళవారం గ్రామదేవత కొళ్లాపురమ్మకు విశేష అభిషేక పూజలు చేపట్టి మహాదీపారాధన చేశారు. మహిళలు అంబలి నైవేద్యం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం గ్రామ దేవత కొళ్లాపురమ్మ మహిషాసురమర్ధిని అలంకరణలో పుష్పాలతో అలంకరించిన వాహనంలో కొలువుదీర్చి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రాత్రి గంగమ్మతల్లిని బాణసంచా వేడుకలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు. మహిళలు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించారు. బుధవారం మధ్యాహ్నం గంగమ్మతల్లిని బజారు వీధిలోని గాంధీ విగ్రహం వద్ద కొలువుదీర్చారు. మహిళలు కుంభం సమర్పించారు. యువత కాళి వేషదారణలో పట్టణ వీధుల్లో హల్‌చల్ చేశారు. సాయంత్రం 6 గంటలకు అశేష జనం నడుమ అమ్మవారిని పట్టణ వీధుల్లో ఊరేగించి నిమజ్జనంకు తరలించారు.


