పుదుచ్చేరిలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

● విజయ్‌ ఫోటో చూపించిన టీవీకే ఎమ్మెల్యే ● మలయాళంలో డీఎంకే ఎమ్మెల్యే ప్రమాణం

సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ వేదికగా బుధవారం కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఆసక్తికరంగా, పలు వినూత్న ఘటనలతో జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాత్కాలిక స్పీకర్‌ (ప్రోటెం స్పీకర్‌) అన్బళగన్‌ అధ్యక్షతన బుధవారం తొలి శాసనసభ సమావేశమైంది. మంగళం నియోజకవర్గం నుంచి ఎన్నికై న సీఎం రంగస్వామి తొలుత భగవంతుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రులు నమశ్శివాయం, మల్లాడి కృష్ణారావు కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ కార్యక్రమం అంతా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల విలక్షణ ఘటనలతో సందడిగా మారింది.

విజయ్‌ ఫోటో చూపించిన టీవీకే ఎమ్మెల్యే..

తమిళనాడు సీఎం విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పుదుచ్చేరి ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకుంది. మణవేలి నియోజకవర్గం నుంచి గెలిచిన టీవీకే ఎమ్మెల్యే రాము ప్రమాణ స్వీకారం చేస్తూ, తన చేతిలో ఉన్న పార్టీ అధినేత విజయ్‌ ఫొటోను సభలో ప్రదర్శించారు. అలాగే ఏంబలమ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మోహన్‌ దాస్‌ ప్రమాణ స్వీకారం చేస్తూ.. దేవుడితో పాటు తన రాజకీయ గురువు ఎన్‌.ఆర్ఙ్‌ (సీఎం రంగస్వామి) పేరును ప్రస్తావించారు. డీఎంకే ఎమ్మెల్యే విఘ్నేష్‌ కణ్ణన్‌ ప్రమాణ స్వీకారం ముగిశాక కణ్ణన్‌ కీర్తి వర్ధిల్లాలి అని నినాదం చేశారు. దీనిపై ప్రోటెం స్పీకర్‌ స్పందిస్తూ, ఎమ్మెల్యేలు ఉత్సాహంతో ప్రమాణ స్వీకార పత్రంలో లేని అదనపు మాటలు మాట్లాడుతున్నారని, అవన్నీ అసెంబ్లీ రికార్డుల్లోకి వెళ్ళవని స్పష్టం చేశారు.

ప్రమాణ స్వీకారంలోనూ నిరసన

అసెంబ్లీలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ప్రధాన అంశం డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం. బాహూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన తమిళంలో కాకుండా మలయాళంలో ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరిలో ఫ్రెంచ్‌ భాషకు ఉన్న ప్రాధాన్యతను, ప్రస్తుత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సెంథిల్‌ కుమార్‌ మొదట ఫ్రెంచ్‌ భాషలో ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి కోరారు. అయితే అసెంబ్లీ సెక్రటరీ దయాళన్‌.. ఫ్రెంచ్‌ భాషలో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇక్కడ ఎలాంటి సాంప్రదాయం, నిబంధనలు లేవని చెప్తూ అనుమతి నిరాకరించారు. దీనికి నిరసనగా, ఫ్రెంచ్‌ భాషా ప్రాముఖ్యతపై అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఆయన తమిళానికి బదులుగా కేరళ అధికారిక భాష అయిన మలయాళంలో ప్రమాణ స్వీకారం చేసి తన నిరసనను నమోదు చేశారు. ఇదిలా ఉండగా పుదుచ్చేరిలోని మొత్తం 30 స్థానాల్లో ఎన్డీయే కూటమి రికార్డు స్థాయిలో మళ్లీ మెజారిటీ సాధించింది. ఇందులో ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 12, బీజేపీ 4, అన్నాడీఎంకే 1, ఎల్‌జేపీ 1 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రతిపక్షంలో డీఎంకే 5, కాంగ్రెస్‌ 1, నేయం మక్కల్‌ కళగం 1, టీవీకే 2, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు.

సీఎం విజయ్‌తో మాట్లాడి

స్థలం సేకరిస్తాం: రంగస్వామి

పుదుచ్చేరి విమానాశ్రయ (ఎయిర్‌పోర్ట్‌) విస్తరణ పనుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో మాట్లాడి, తమిళనాడు పరిధిలోకి వచ్చే భూమిని సేకరించి విస్తరణ పనులు చేపడతామని పుదుచ్చేరి సీఎం ఎన్‌. రంగస్వామి స్పష్టం చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ అద్భుతంగా పని చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ, పుదుచ్చేరికి చెందిన ఆనంద్‌కు తమిళనాడు క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కడం సంతోషకరం. ఎంతో అనుభవజ్ఞుడైన ఆయన మంత్రిగా రాణిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

విమానాశ్రయ విస్తరణ – అభివృద్ధి

పుదుచ్చేరి ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే విస్తరణకు తమిళనాడు పరిధిలోని భూములు అవసరం ఉన్న నేపథ్యంలో.. ఈ విషయంపై తమిళనాడు సీఎం విజయ్‌తో స్వయంగా మాట్లాడి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రంగస్వామి తెలిపారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లుగానే పుదుచ్చేరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ శ్రీబెస్ట్‌ పుదుచ్చేరిశ్రీగా మారుతోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

రూ. 100 కోట్ల బేరసారాల ఆరోపణలు

పుదుచ్చేరిలో మంత్రి పదవి కోసం 100 కోట్ల రూపాయల బేరసారాలు జరిగాయంటూ మాజీ సీఎం నారాయణ స్వామి చేసిన ఆరోపణలపై రంగస్వామి స్పందించారు. ఆ బేరసారాలు ఎవరెవరి మధ్య జరిగాయో నారాయణ స్వామి స్పష్టంగా చెప్తే, దానిపై కచ్చితంగా విచారణ జరిపిస్తాం అని సవాల్‌ విసిరారు. పుదుచ్చేరికి కేంద్ర పాలిత ప్రాంతం నుంచి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా తీసుకురావడానికి తమ ప్రభుత్వం నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉంటుందని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కచ్చితంగా పుదుచ్చేరికి రాష్ట్ర హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక, తన రాజీనామాతో ఖాళీగా ఉన్న తట్టాంచావడి నియోజకవర్గానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత, కూటమి తరపున అభ్యర్థి ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని సీఎం రంగస్వామి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement