పార్టీ పతనానికి పళనిస్వామే కారణం | - | Sakshi
Sakshi News home page

పార్టీ పతనానికి పళనిస్వామే కారణం

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

● మాజీ మంత్రి సి.వి.షణ్ముగం ఆరోపణలు

అన్నాడీఎంకే కార్యాలయం

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒంటెద్దు పోకడలే కారణమని మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు సి.వి. షణ్ముగం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీతో కూటమి ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలను పళనిస్వామి అహంకారంతో తిరస్కరించారని ఆయన ఆరోపించారు. చైన్నెలో మంగళవారం ఎస్‌.పి. వేలుమణి, సి. విజయభాస్కర్‌ సహా పలువురు అన్నాడీఎంకే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సి.వి. షణ్ముగం సమావేశమయ్యారు. అనంతర సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పళనిస్వామి నాయకత్వంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కూటమిని కావాలనే చెడగొట్టారు

విలేకరుల సమావేశంలో సి.వి. షణ్ముగం మాట్లాడుతూ...అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిందన్నారు.. 2019 నుండి పార్టీ వరుస ఓటములను ఎదుర్కొంటోందని, ఓటు బ్యాంక్‌ కూడా భారీగా పడిపోతోందని వివరించారు. ఈ నేపథ్యంలో బలమైన కూటమిని ఏర్పాటు చేయాలని తాము పళనిస్వామికి సూచించామన్నారు. ఎన్నికల సమయంలో తమిళగ వెట్రి కళగం తరఫున కూటమి చర్చల కోసం వచ్చిన ప్రతినిధులను పళనిస్వామి తీవ్రంగా అవమానించి పంపించి వేశారని ఆరోపించారు. కూటమి కుదరకూడదనే భావనతో వారిని దూరం పెట్టారని మండి పడ్డారు. అలాగే డీఎండీకే కేవలం అర శాతం ఓట్లు ఉన్న పార్టీ అని ఎగతాళి చేస్తూ కూటమి నుండి బయటకు పంపించారని, డాక్టర్‌ కృష్ణసామి వంటి మిత్రపక్ష నాయకులను కూడా పళనిస్వామి కలుపుకొని పోలేకపోయారని సీవీ షణ్ముగం మండిపడ్డారు.

31 మంది జిల్లా కార్యదర్శుల

తొలగింపు చట్టవిరుద్ధం

ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే, మరోవైపు జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసిన 31 మంది జిల్లా కార్యదర్శులను పళనిస్వామి ఏకపక్షంగా తొలగించడాన్ని షణ్ముగం తీవ్రంగా ఖండించారు. ఈ తొలగింపులు చట్టబద్ధంగా చెల్లవని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనల ప్రకారం 5 వంతులలో ఒక వంతు మంది సభ్యులు సంతకాలు చేసి కోరితే, 30 రోజుల్లోగా జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, పళనిస్వామి సర్వాధికారిలా వ్యవహరిస్తూ దానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. తాము పార్టీకి ద్రోహం చేయలేదని, అన్నాడీఎంకేను మళ్లీ బలోపేతం చేయడమే తమ ఏకై క లక్ష్యమని షణ్ముగం స్పష్టం చేశారు. పళనిస్వామికి ధైర్యముంటే వెంటనే జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటమిపై బహిరంగంగా చర్చించాలని సవాల్‌ విసిరారు. అక్కడ మెజారిటీ సభ్యులు ఏది నిర్ణయిస్తే దానికి తాము కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కాగా, ఈ అంతర్గత తిరుగుబాటుతో తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పదవికి ముప్పు వస్తేనే ’తప్పులు’ గుర్తొస్తాయా?

పార్టీ నుండి తొలగించబడిన ఓ. పన్నీర్‌సెల్వం తాను ఎటువంటి పదవులు ఆశించడం లేదని, కేవలం సాధారణ కార్యకర్తగా ఉంటానని చెప్పినా పళనిస్వామి చేర్చుకోలేదని షణ్ముగం గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తన పదవికి ముప్పు వచ్చేసరికి, తప్పు చేసిన వారు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే చేర్చుకుంటాం అంటూ పళనిస్వామి ప్రకటనలు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందే అందరినీ కలుపుకొని పోయి ఉంటే పళనిస్వామి తాజాగా ముఖ్యమంత్రి అయ్యేవారని, పార్టీని ముంచేసి ఇప్పుడు తానొక్కడే మంచివాడినని నిరూపించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement