సాక్షి, చైన్నె : తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల తదనంతర పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ యూత్ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలీమ్ అల్ బుఖారీ మంగళవారం డీఎంకేలో చేరారు. చైన్నెలోని అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్టాలిన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, డీఎంకే అధికార ప్రతినిధి టి.కె.ఎస్. ఇలంగోవన్, లీగల్ సెల్ సెక్రటరీ ఎన్.ఆర్. ఇలంగోవన్, తిరుచ్చి సౌత్ జిల్లా కార్యదర్శి అన్బిల్ మహేష్ పొయ్యామొళి, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి పూచి మురుగన్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నిర్ణయంపై అసంతృప్తి
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీతో చేతులు కలిపింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అలీమ్ అల్ బుఖారీ తీవ్రంగా వ్యతిరేకించారు. కూటమి మార్పుపై ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతో క్రమశిక్షణా చర్యల కింద కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పార్టీలోని అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అలీమ్ అల్ బుఖారీ తాజాగా డీఎంకే గూటికి చేరారు.
ఓటమిపై డీఎంకేలో అంతర్మథనం
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోవడంపై ఆ పార్టీ నాయకత్వం సమీక్షలు ప్రారంభించింది. ఓటమికి గల కారణాలను అన్వేషించేందుకు పార్టీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి వెళ్లి క్షేత్రస్థాయిలో ఓటమికి గల కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో, చైన్నె అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ అధ్యక్షతన సీనియర్ నాయకుల ఉన్నత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ భేటీలో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కనిమొళి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్. భారతి, మీడియా విభాగాధిపతి టి.కె.ఎస్. ఇలంగోవన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఓటమి శాశ్వతం కాదని, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రతి జిల్లాలోనూ త్వరలోనే సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు.
23న యువజన విభాగం భేటీ
మే 23న డీఎంకే యువజన విభాగం కీలక సమావేశంకు చర్యలు చేపట్టారు. చైన్నెలోని అన్నా అరివాలయం ’కలైంజ్ఞర్ ఆడిటోరియంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. జూన్ 3వ తేదీన జరగనున్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత కళాకారుడు కరుణానిధి జయంతి వేడుకల నిర్వహణతో పాటూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నామన్నారు. జిల్లా, నగర, రాష్ట్ర ఆర్గనైజర్లు ,డిప్యూటీ ఆర్గనైజర్లు అందరూ తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని ఉదయనిధి స్టాలిన్ కోరారు.


