జాలర్ల వలలో మిస్టరీ వస్తువు | - | Sakshi
Sakshi News home page

జాలర్ల వలలో మిస్టరీ వస్తువు

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

తిరువొత్తియూరు: పళవేర్కాడు సముద్రంలో చేపలు పడుతుండగా మత్స్యకారుల వలలో చిక్కుకున్న ఓ వస్తువు బాంబు అయి ఉండవచ్చనే అనుమానంతో కలకలం రేగింది. దీనిపై సమచారం మేరకు పోలీసులు ఆ వస్తువును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. వివరాలు.. పొన్నేరి సమీపంలోని పళవేర్కాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న 30కి పైగా మత్స్యకార గ్రామాల ప్రజలు పళవేర్కాడు సరస్సులో సముద్రంలో చేపలు పడుతుంటారు. సోమ వారం ఎప్పటిలాగే పశియావరానికి చెందిన దేవప్రకాష్‌ అనే వ్యక్తి తన పడవలో మరో నలుగురితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లారు. సముద్రంలో కొంత దూరంలో వారు చేపలు పడుతుండగా వారి వలలో సుమారు 10 కిలోల బరువున్న ఇనుముతో చేసిన తుప్పు పట్టిన స్థితిలో ఉన్న బాంబు వంటి ఓ వస్తువు చిక్కుకుంది. దీనిని చూసి మత్స్యకారులు షాక్‌ అయ్యారు . వారు తిరుప్పాలైవనం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మిస్టరీ వస్తువును స్వాధీనం చేసుకున్నారు. అది శిక్షణ సమయంలో ఉపయోగించిన బాంబా లేక రాకెట్‌ లాంచరా? నౌకాదళం ఓడ నుండి పొరపాటున పడిపోయిందా? లేదా ఎవరైనా విధ్వంసకర చర్యల కోసం దానిని ఉంచారా? అనే వివిధ కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement