జిల్లాల కార్యదర్శుల సమావేశంలో తీర్మానం మెజారిటీ శాతం కార్యదర్శుల హాజరు ఎన్నికల ఫలితాలపై సమీక్ష తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలకు కార్యాచరణ
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళణిస్వామి మంగళవారం జిల్లాల కార్యదర్శులతో
సమీక్షించారు. మెజారిటీ శాతం జిల్లాల కార్యదర్శులు పళణిస్వామికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా విడి పోయిన విషయం తెలిసిందే. ఇందులో 25 మంది టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. మిగిలిన 22 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వెన్నంటి నడుస్తున్నారు. తిరుగు బాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి తదితరులు పళణి స్వామిని ప్రధాన కార్యదర్శిగా గద్దె దించి పార్టీని కై వశంచేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు. అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు 25 మందిపై అనర్హత వేటు వేయించే దిశగా పళణి స్వామి ఉరకలు తీస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం ఓ వైపు పార్టీ జిల్లాల కార్యదర్శులతో పళణి స్వామి సమావేశం ఏర్పాటు చేయగా, మరో వైపు మద్దతు ఎమ్మెల్యేలతో సీవీ షన్ముగం, ఎస్పీ వేలుమణిలు మంతనాలలలో మునిగారు.
సుదీర్ఘంగా సమీక్ష
అసెంబ్లీ సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే ) పార్టీ తమ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించింది. చైన్నె రాయపేటలోని అవ్వై షణ్ముగం సాలైలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం ‘పురట్చి తలైవర్ ఎమ్.జి.ఆర్. మాళిగై’లో మంగళవారం అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శుల కీలక సమీక్షా సమావేశం జరిగింది. పార్టీ ప్రిసిడియం చైర్మన్ డాక్టర్ ఎ. తమిళ్‌మగన్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఎడప్పాడి కె.పళనిస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు, పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వాహకులతో విడివిడిగా ఉన్నత స్థాయి సంప్రదింపు జరిపారు. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు.
పళణి నాయకత్వానికి మద్దతు
ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమిళనాడు అంతటా సుడిగాలి పర్యటనలు చేసి, పార్టీ , కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశారని నేతలు ప్రశంసించారు. ఆయన అలుపెరగని కృషి కారణంగా అన్నాడీఎంకే తరపున 47 మంది, కూటమి పార్టీల తరపున మరో ఆరుగుర మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారని గుర్తుచేశారు. ఈ విజయానికి పూర్తి కారకుడైన ఎడప్పాడి పళనిస్వామికి జిల్లా కార్యదర్శులు, పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వాహకులు ఈ సమావేశంలో అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ ఎదుగుదల, బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటాల గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అదే సమయంలో ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై తామందరికీ పూర్తి నమ్మకం ఉందని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక, పళణి స్వామి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉంటామని, ఇందుకు సహకరిస్తామని పుదుచ్చేరి అన్నాడీఎంకే నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు 25 మందిపై చట్ట పరంగా చర్యలకు అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శులే ముక్తకంఠంతో ఆమోదించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమావేశానికి అన్నాడీఎంకే పార్టీ పరంగా ఉన్న జిల్లాలో 80 జిల్లాలకు చెందిన కార్యదర్శులు హాజరైనట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, సీనియర్ నేత జయకుమార్ ఈ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది.


