క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

ఎరువుల కొరత రాకుండా

చూడండి

ప్రధాని మోదీకి సీఎం విజయ్‌ లేఖ

సాక్షి, చైన్నె: తమిళనాడులో 2026 ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరువులను ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎస్‌. జోసెఫ్‌ విజయ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఆయన కేంద్రానికి అధికారిక విజ్ఞప్తి పంపారు. తమిళనాడులో వ్యవసాయ రంగ ప్రాధాన్యతను, ప్రస్తుత ఎరువుల కొరతను వివరిస్తూ సీఎం విజయ్‌ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అలాగే సీఎం విజయ్‌ను సచివాలయంలో పలువురు ప్రముఖులు కలిశారు. వీరిలో అపోలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ప్రీతారెడ్డి, ఎండీ డాక్టర్‌ కవితారెడ్డి ఉన్నారు. అలాగే, తమిళనాడు దివ్యాంగుల సలహా కమిటీ సభ్యురాలు స్మిత సదాశివం, ఇతర ప్రతినిధులు జ్ఞాన భారతీ, హేమచంద్రన్‌, శరవణన్‌, తమిళనాడుకు కేటాయించిన ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ట్రైనీ ఆఫీసర్ల బృందం,ట్రాన్స్‌ జెండర్లహక్కుల కార్యకర్తలు గ్రేష్‌ భాను, బోర్న్‌టు విన్‌ డైరెక్టర్‌ శ్వేత సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

సిటీ బస్సులో గొడవ

– వృద్ధుడిపై డ్రైవర్‌, కండక్టర్‌ దాడి

తిరువొత్తియూరు: చైన్నె ఆళ్వార్‌పేటకు చెందిన కోటీశ్వరన్‌ (71) సామాజిక కార్యకర్త. సోమ వారం సాయంత్రం టి.నగర్‌ సమీపంలోని భారతీ నగర్‌ బస్టాప్‌ నుండి సిటీ బస్సు (నెం. 72ఈ) ఎక్కారు. తాను చూలైమేడు వెళ్లాలని ఆయన కండక్టర్‌తో చెప్పారు. అయితే బస్సు అటువైపు వెళ్లదని కండక్టర్‌ చెప్పడంతో, నేను ఇక్కడే దిగిపోతాను, బస్సు ఆపండి అని కోటీశ్వరన్‌ కోరారు. కానీ, బస్సు తర్వాత స్టాప్‌లోనే ఆగుతుందని, అప్పటి వరకు కచ్చితంగా టికెట్‌ తీసుకోవాలని కండక్టర్‌ బలవంతం చేశారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత టికెట్‌ తీసుకున్న కోటీశ్వరన్‌ లిబర్టీ బస్టాప్‌లో దిగారు. అప్పుడు ఆయన్ని వెంబడిస్తూ కిందకు దిగిన డ్రైవర్‌, కండక్టర్‌ ఇద్దరూ కలిసి కోటీశ్వరన్‌పై దాడి చేసి, అక్కడి నుంచి బస్సుతో పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కోటీశ్వరన్‌ ప్రస్తుతం ఓమందూరార్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోడంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు ఢీకొని

బాలుడి దుర్మరణం

తిరువొత్తియూరు: ప్రభుత్వ బస్సు ఢీకొని తల్లి కళ్ల ముందే కుమారుడు మృతిచెందిన విషాదకర సంఘటన పుళల్‌ సమీపంలో చోటుచేసుకుంది. పుళల్‌ సమీపం కదిర్వేడు, భజన కోవెల వీధికి చెందిన దేవనాథన్‌ (44) ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌. ఇతని భార్య ప్రియ. ఈమె ద్విచక్ర వాహనంలో సోమవారం కుమారుడు నరేన్‌ తేజో (8)ను తీసుకుని ట్యూషన్‌న్‌ సెంటర్‌కు వెళ్లేందుకు బయలుదేరింది. కదిర్వేడు వినాయకపురం మీదుగా చెంగల్పట్టు – రెట్టేరి కదిర్వేడు వంతెన కింద వెళ్తుండగా, చైన్నె, ప్యారిస్‌ నుంచి చెంగల్పట్టు వెళుతున్న ప్రభుత్వ బస్సు బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లికుమారుడు రోడ్డుపై పడ్డారు. బస్సు బాలుడి తలపై దూసుకెళ్లడంతో నరేన్‌ తేజో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రియ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తన కళ్లముందే కుమారుడు మృతి చెందడంతో ఆమె బోరున విలపించారు. మాధవరం పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌, వ్యాసార్పాడికి చెందిన బాలగణేష్‌ (30)ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

బావిలోపడిన ట్రాక్టర్‌

బాలుడి మృతి

మరొకరికి తీవ్రగాయాలు

తిరుత్తణి: ఆగివున్న ట్రాక్టర్‌ ఎక్కి ఆడుకుంటూ బైక్‌ తాళంతో ట్రాక్టర్‌ ఆన్‌చేయగా ట్రాక్టర్‌ స్టార్టయి రివర్స్‌లో వెళ్లి బావిలో పడింది. ఈప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతిచెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తిరుత్తణి సమీపం కాంచిప్కాడి గ్రామానికి చెందిన పన్నీరుసెల్వం (40 రైతు. ఇతని కుమారుడు రాకేష్‌(6). సోమవారం ఇంటి వద్ద నిలిపి ఉన్న ట్రాక్టర్‌పై రాకేష్‌, అదే గ్రామానికి చెందిన మునుస్వామి కుమారుడు యశ్విన్‌(5) ఆడుకుంటున్నారు. ఈక్రమంలో చేతిలో ఉన్న బైక్‌ తాళం తీసి రాకేష్‌ స్టార్ట్‌ చేశాడు. ట్రాక్టర్‌ స్టార్ట్‌ అయి వెనక్కి వెళ్లి అక్కడ ఉన్న పాడుబడిన బావిలో పడింది. ప్రమాదంలో ట్రాక్టర్‌ కిందపడిన రాకేష్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యశ్విన్‌కి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని, గాయపడ్డ యశ్విన్‌కు బయటకు తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement