సాక్షి, చైన్నె: తమిళనాడులోని హిందూ దేవాలయాలలో అమలులో ఉన్న ప్రత్యేక రుసుము (వీఐపీ) దర్శన విధానాన్ని పూర్తిగా రద్దు చేసేలా దేవాదాయ శాఖను ఆదేశించాలంటూ మద్రాస్ హైకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్ దాఖలైంది. విశ్వహిందూ పరిషత్ ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి. చొక్కలింగం ఈ పిటిషన్‌ను మంగళవారం దాఖలు చేశారు.
రూ. 500 వరకు వసూలు
తమిళనాడు హిందూమత దేవాదాయ శాఖ నియంత్రణలో ఉన్న ప్రధాన ఆలయాలలో రద్దీని నియంత్రించే నెపంతో, ఒక్కో టికెట్‌కు రూ. 500 వరకు వసూలు చేస్తూ ప్రత్యేక దర్శన విధానాన్ని కొనసాగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆలయాలలో డబ్బులు వసూలు చేసి ప్రత్యేక దర్శనాలు కల్పించడానికి ఎటువంటి చట్టపరమైన నిబంధనలు లేదా అనుమతులు లేవని పేర్కొన్నారు.1967 తర్వాత ద్రవిడ పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుండే ఈ వాణిజ్య పద్ధతి అమలులోకి వచ్చిందని ఆయన విమర్శించారు.
సాధారణ భక్తులకు అన్యాయం
ఈ రుసుము దర్శనాల కారణంగా పేద, సాధారణ భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నగదు ఆధారంగా భక్తుల మధ్య వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.డబ్బు ఉన్నవారికే ముందస్తు దర్శనం కల్పించే ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేసేలా దేవాదాయ శాఖకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వీహెచ్‌పీ నేత చొక్కలింగం కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.


