సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వినూత్న రీతిలో తన మొక్కును తీర్చుకున్నారు. మధురై జిల్లా చోళవందాన్ నియోజకవర్గం నుండి టీవీకే తరపున పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే ఎమ్.వి. కరుప్పయ్య.. విజయ్ ముఖ్యమంత్రి కావాలని చోళవందాన్ పరిధిలోని ప్రసిద్ధ మారియమ్మన్ దేవతకు మొక్కుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో తన మొక్కును తీర్చుకోవడానికి కరుప్పయ్య సిద్ధమయ్యారు. మారియమ్మన్ ఆలయ వైశాఖ ఉత్సవాల ధ్వజారోహణ కార్యక్రమం సందర్భంగా.. కరుప్పయ్య ఆలంగొట్టారంలో ఉన్న ఒక వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. చేతిలో టీవీకే పార్టీ జెండాను పట్టుకుని బావి నీటిలోకి దిగి న ఆయన, నీటిపై వెల్లకిలా పడుకుని అసాధారణ రీతిలో తేలుతూ ఏకధాటిగా 3 గంటల పాటు యోగాసనం వేశారు. ఈ సాహసాన్ని చూసేందుకు స్థానికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గతంలో జయలలిత కోసం కూడా..
కరుప్పయ్యకు ఇలా నీటిపై తేలుతూ మొక్కులు చెల్లించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన అన్నాడీఎంకేలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఆరోగ్యం కుదుటపడాలని, ఆమె మళ్లీ సీఎం కావాలని కూడా ఇలాగే సుదీర్ఘ సమయం పాటు నీటిపై తేలుతూ యోగాసనాలు వేసి రికార్డు సృష్టించడం గమనార్హం.


