ఊటీ కనువిందు | - | Sakshi
Sakshi News home page

ఊటీ కనువిందు

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

తిరువొత్తియూరు: ఊటీ ప్రభుత్వ వృక్షశాస్త్ర ఉద్యానవనంలో 128వ పుష్ప ప్రదర్శన సోమవారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. నీలగిరి జిల్లా ఊటీకి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వారిని అలరించడానికి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కోతగిరిలో కూరగాయల ప్రదర్శన, ఊటీలో రోజా, పుష్ప ప్రదర్శనలు, కూనూరులో పండ్ల ప్రదర్శన, గూడలూరులో సుగంధ ద్రవ్యాల ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. వీటిలో పుష్ప ప్రదర్శన అతి ముఖ్యమైన వేడుకగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది సోమవారం(మే 18వ తేదీ) పుష్ప ప్రదర్శనను నీలగిరి జిల్లా కలెక్టర్‌ లక్ష్మి భవ్య తన్నీరు ప్రారంభించి పరిశీలించారు. ఈ ప్రదర్శన ఈ నెల 28వ తేదీ వరకు మొత్తం 10 రోజులపాటు జరగనుంది. ఈ ప్రదర్శనలో మేరీగోల్డ్‌, సైక్లమెన్‌, బాల్సమ్‌, పెటునియా, పాన్సీ, డెల్ఫీనియంతో సహా 275 రకాలకు చెందిన 7 లక్షల రంగురంగుల పుష్ప మొక్కలు కొలువుదీరాయి. ఆయా ప్రాంతాల్లోని నడక దారుల్లోనూ మొక్కలు నాటగా, అందులో పూలు పూసి కనువిందు చేస్తున్నాయి ఇది కాకుండా అలంకార మండపాలు, పార్కులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పచ్చిక బయళ్లను అలంకరించడం కోసం 35 వేల కుండీలలో నాటిన పూల మొక్కలను అలంకరించారు. ఈసారి పుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా 1.5 లక్షల కార్నేషన్‌ పూలతో భారీ చైన్నె సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌, ఒక లక్ష పూలతో మామళ్లపురం దేవాలయాలు, గోపురాలు నిర్మించబడ్డాయి. ఇది కాకుండా 4.5 లక్షల పూలతో వివిధ రకాల పుష్ప అలంకరణలు చేశారు. తిరువళ్లువర్‌ విగ్రహం, నర్తకిల ప్రతిమలు, పుష్ప గోపురాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పుష్ప అలంకరణల కోసం కోత పూలను స్థానిక వ్యాపారుల నుండి, అదనపు పూలను ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి ఉపయోగించారు.

కమనీయం.. పుష్పప్రదర్శన

పుష్ప ప్రదర్శనను పురస్కరించుకుని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో పార్కును అలంకరించారు. వివిధ కళా ప్రదర్శనల కోసం భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా పువ్వులు, కూరగాయలతో రకరకాల అలంకరణలు కూడా చేశారు. ఫొటోలు తీసుకోవడానికి అక్కడక్కడ సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. సోమవారం ప్రారంభమైన ఈ పుష్ప ప్రదర్శనను భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చి తిలకిస్తున్నారు. పుష్ప ప్రదర్శన నేపథ్యంలో ఊటీలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, భద్రతా పనుల్లో 500 మందికి పైగా పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పుష్ప ప్రదర్శన చూడడానికి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం ప్రభుత్వ రవాణా సంస్థ తరఫున ఊటీ–కోయంబత్తూర్‌ మధ్య 50 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అదేవిధంగా అన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా 30కి పైగా సర్క్యూట్‌ బస్సులు కూడా నడుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement