పీఎం శ్రీ పథకంపై త్వరలో నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

పీఎం శ్రీ పథకంపై త్వరలో నిర్ణయం

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

● మంత్రి రాజ్‌మోహన్‌ స్పష్టీకరణ ● బడి తెరిచిన రోజే పుస్తాలు అందజేస్తామని ప్రకటన

సమీక్షా సమావేశంలో ముఖ్యాంశాలు

సాక్షి, చైన్నె: పీఎం శ్రీ పథకం అమలుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌ స్పష్టం చేశారు.సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో విలేకరులు తమిళనాడులో పీఎం శ్రీ పథకాన్ని అమలు చేస్తారా? అని ప్రశ్నించగా మంత్రి సమాధానమిస్తూ.. ‘ద్విభాషా విధానమే మా ప్రాథమిక సిద్ధాంతం. బంధుమిత్రులతో మాట్లాడటానికి తమిళం, ప్రపంచంతో మాట్లాడటానికి ఇంగ్లీష్‌.. ఇదే మా విధానం. పీఎం శ్రీ పథకంపై అధికారులతో సంప్రదింపులు జరిపి తదుపరి నిర్ణయం ప్రకటిస్తాం‘ అని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ పీఎం శ్రీ స్కూల్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. అయితే ఈ పథకంలో త్రిభాషా విధానం ఉండటంతో తమిళనాడు దీనిని వ్యతిరేకించింది. దీని కారణంగా సమగ్ర శిక్షా అభియాన్‌ కింద తమిళనాడుకు కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 3,500 కోట్ల విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. తాజాగా, తమిళనాడులో తమిళగ వెట్రి కళగంనేతృత్వంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. కేంద్ర విద్యాశాఖ తమిళనాడు ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. పీఎం శ్రీ పథకం కింద పాఠశాలలను ఆధునీకరించేందుకు తక్షణమే ఒప్పందంపై సంతకం చేయాలని అందులో కోరింది.దీనిపై కొత్త టీవీకే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? గత డీఎంకే ప్రభుత్వం తరహాలోనే వ్యతిరేకిస్తుందా లేక నిలిపివేసిన నిధులను రాబట్టేందుకు ఒప్పందం చేసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే మంత్రి రాజ్‌మోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాఠశాల విద్యాశాఖ, తమిళ అభివృద్ధి, సమాచార , ప్రచార శాఖల మంత్రి రాజ్‌మోహన్‌ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను మంత్రి ప్రకటించారు. ఈ మేరకు 1, 2, 3 తరగతుల విద్యార్థుల కోసం సరికొత్త సిలబస్‌తో రూపొందించిన 9 పాఠ్యపుస్తకాలను మంత్రి విడుదల చేశారు. పిల్లల శారీరక, మానసిక, సామాజిక నైపుణ్యాలను పెంపొందించేలా, రంగురంగుల చిత్రాలు, కథలు, పాటలతో ఈ పుస్తకాలను రూపొందించారు. తమిళనాడులో వేసవి సెలవుల అనంతరం జూన్‌ 1, 2026 నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. బడి తెరిచిన మొదటి రోజే 1 నుండి 12వ తరగతి విద్యార్థులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాంలు, స్కూల్‌ బ్యాగులు అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్త పాఠ్యపుస్తకాల నేపథ్యంలో 1 నుండి 3 తరగతుల బోధించే ఉపాధ్యాయులకు జూన్‌ 1 నుండి జూన్‌ 3 వరకు ప్రత్యేక బోధనా నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement