మట్టి తవ్వకాలపై నిరసన | - | Sakshi
Sakshi News home page

మట్టి తవ్వకాలపై నిరసన

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

– జేసీబీలను అడ్డుకున్న జనం

తిరువళ్లూరు: రోడ్డు విస్తరణ పనుల పేరిట మట్టి తవ్వకాలకు యత్నించిన క్వారీ నిర్వాహకుల జేసీబీలను అడ్డుకుని స్థానికులు రాస్తారోకో నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లా మీదుగా తిరుపతి–చైన్నె, చైన్నె పోర్టు–మహాబలిపురం తదితర రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. వీటితోపాటు తచ్చూరు నుంచి చిత్తూరు వరకు నిర్వహిస్తున్న రెండవ దశ పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు పనులకు కోసం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో క్వారీకి అనుమతి ఇచ్చి మట్టి తవ్వకాలను చేస్తున్నారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లా పున్నపాక్కం గ్రామంలోని చెరువులో మట్టి తవ్వకాల కోసం అనుమతి ఇచ్చిన క్రమంలో సోమవారం ఉదయం ఆరు జేసీబీ వాహనాలు, ప్రోక్లెయిన్‌లు చెరువు వద్దకు చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు లారీలు, ప్రోక్లెయిన్‌, జేసీబీ యంత్రాలను అడ్డుకుని స్థానికులు ఆందోళన నిర్వహించారు. పున్నపాక్కం చెరువుపై ఆధారపడి సుమారు రెండువేల ఎకరాల భూములు సాగులో ఉంది. ఇప్పటికే రెండు సార్లు చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతి ఇవ్వగా, నిబంధనలను విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేయడంతో సాగుకు నీరు అందకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. మళ్లీ అనుమతి ఇస్తే ఎక్కువగా మట్టి తవ్వకాలు చేయడంతో భూగర్భ జలాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని స్థానికులు వాపోయారు. స్థానికుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు రెవెన్యూ అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు. మట్టి తవ్వకాలను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో స్థానికులు ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement