● అహ్మద్ బుహారీ కేసులపై కోర్టు నిర్ణయం
సాక్షి, చైన్నె: కోస్టల్ ఎనర్జీ ప్రమోటర్ అహ్మద్ బుహారి, అతని సహచరులపై ఉన్న కేసులన్నీ కోర్టు కొట్టివేసింది. ఆయన కడిగిన ముత్యంలా బయటపడ్డారు. కోస్టల్ ఎనర్జీ ప్రమోటర్ అయిన అహ్మద్ బుహారీకి సంబంధించిన చివరి పెండింగ్ కేసును సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు(స్పెషల్ సీసీ నెం.1/2022), ఈ ఏడాది ఏప్రిల్ 28న కొట్టివేసింది. ఈ ఉత్తర్వులతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అతను, అతని సహచరులపై దాఖలు చేసిన పలు కేసులను, వరుసగా ముంబయిలోని సీఈఎస్‌టీఏటీ, ఢిల్లీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టులతో సహా వివిధ న్యాయ వేదికలు ఇప్పుడు కొట్టివేశాయి. తూత్తుకుడి కేంద్రంగా పనిచేస్తున్న 1,200 మెగావాట్ల స్వతంత్ర విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఐపీపీ) అయిన కోస్టల్ ఎనర్జ , కోస్టల్ ఎనర్జెన్ ప్రమోటర్ అహ్మద్ బుహారీ, ప్రభుత్వ రంగ సంస్థలకు(పీయూఎస్) నాసిరకం బొగ్గు సరఫరా చేశారనే ఆరోపణలకు సంబంధించిన ఒక హై–ప్రొఫైల్ కేసులో 2022 మార్చి 3న అరెస్టు అయ్యారు. ఈ ప్రధాన నేరంలో సీబీఐ ఎటువంటి ఛార్జిషీట్ దాఖలు చేయనప్పటికీ, అతని తరఫున దాఖలు చేసిన పలు బెయిల్ దరఖాస్తులను వివిధ కోర్టులు తిరస్కరించాయి. 31 నెలలకు పైగా జైలులో గడిపిన తర్వాత, అతనిపై ఎలాంటి అభియోగాలు నమోదు కానప్పటికీ, చివరకు 2024 అక్టోబర్ 24న అతనికి బెయిల్ మంజూరైంది. తదనంతరం మద్రాస్ హైకోర్టు 2025 అక్టోబర్ 7న ఈ కేసును కొట్టివేసింది. ఆ తర్వాత సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి, 2026 ఏప్రిల్ 28న అతనికి అతని సహచరులకు వ్యతిరేకంగా ఉన్న అన్ని అభియోగాలను మూసివేసింది. అభియోగాల నుండి నిర్దోషులుగా విడుదలైన వ్యక్తుల కేసులలో పరిహారంపై సుప్రీంకోర్టు ఇటీవల చర్చిస్తోంది.


