బ్లాక్‌డే నిరసనల హోరు
సాక్షి, చైన్నె: బాబ్రీ మసీదు కూల్చివేత రోజును పురష్కరించుకుని రాష్ట్రంలో శనివారం మైనారిటీ సంఽఘాలు, పార్టీల నిరసనలు హోరెత్తాయి. జాతీయ సమైక్యతను కాంక్షిస్తూ, హక్కుల పరిరక్షణకు నినాదాలను హోరెత్తించారు.
బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజైన డిసెంబరు 6వ తేదీ అంటే పోలీసులకు ప్రతి ఏటా టెన్షన్ తప్పదు. ఈ ఏడాది ఢిల్లీలో కారు బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. దీంతో బ్లాక్ డే రోజున ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా శనివారం వ్యవహరించారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలు, అన్ని మతాలకు చెందిన ఆలయాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రతతో వ్యవహరించారు. తనిఖీలు ముమ్మరం చేసి అప్రమత్తంగా వ్యవహరించారు. ఇక, బ్లాక్ డే నిరసనలు హోరెత్తాయి. జాతీయ సమైఖ్యతను కాంక్షిస్తూ, హక్కులను పరిరక్షించే విధంగా మైనారిటీ సంఘాలు, పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తించాయి. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం నేతృత్వంలో చైన్నెలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. నేతలందరూ నల్ల బ్యాడ్జీలు, కండువాలను ధరించి నిరసనకు తరలివచ్చారు. ఆ కళగం నేతలు ఖాజాఖని, ఎస్‌ఏ షేక్ మహ్మద్ అలీ, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, సీపీఎం కార్యదర్శి షణ్ముగం, సీపీఐ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు రవీంద్రన్, పలు పార్టీల నేతలు నిరసనకు తరలివచ్చారు. మత సామరస్యం పరిరక్షణ, ప్రజల హక్కుల పరిరక్షణ నినాదాలను హోరెత్తించారు. ప్రార్థనా మందిరాలను పరిరక్షించాలని, వక్ఫ్ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు.


