10లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు
19న పంపిణీకి కసరత్తులు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలోని కళాశాలలో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులు 10 లక్షల మందికి తొలివిడతగా ల్యాప్‌టాప్‌ల పంపిణీకి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈనెల 19 నుంచి శ్రీకారం చుట్టనున్నారు. దివంగత సీఎం జే జయలలిత జీవించి ఉన్న కాలంలో అన్నాడీఎంకే ప్రభుత్వం గతంలో ప్లస్‌ఒన్ ముగించి ప్లస్‌టూ వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ల పంపిణీ జరిగేది. అయితే, ఆమె మరణంతో ఈ పథకం మూలన పడింది. డీఎంకే ఈ పథకంపై దృష్టి పెట్ట లేదు. అయితే ఇటీవల బడ్జెట్ సమావేశాలలో ల్యాప్‌టాప్ ప్రస్తావనను తెరపైకి పాలకులు తీసుకొచ్చారు. ఈసారి ప్రభుత్వ పరిధిలోని కళాశాలలో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయడానికి నిర్ణయించారు. ఈ ల్యాప్‌టాప్‌ల పంపిణీ నిమిత్తం ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు, అన్నా వర్సిటీ, ఐఐటీ మద్రాస్, కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, తమిళనాడు ఈ–గవర్నన్స్ ఏజెన్సీ, టెక్నాలజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తమిళనాడు వాటిలోని నిపుణులతో సాంకేతిక ప్రమాణాల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద అందించే ల్యాప్‌టాప్ పనితీరు, మెమరీ (స్టోరేజ్), సాఫ్ట్‌వేర్, బ్యాటరీ సామర్థ్యం, హార్డ్‌వేర్ సహా సాంకేతిక పరికరాల సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేశారు. మరిన్ని సమాచార సాంకేతికత, సాఫ్ట్‌వేర్ సంబంధిత డిజిటల్ సేవల పరిశ్రమ నుంచి ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్‌లను పంపిణీ చేయడానికి తాజాగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 10 లక్షల మందికి తొలి విడత పంపిణీకి చర్యలు చేపట్టారు. ఈమేరకు ఈనెల 19 నుంచి ఈ పంపిణీ జరగనుంది. మూడు ప్రముఖ కంపెనీల నుంచి ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేశారు. ఒక్కో ల్యాప్‌టాప్ ఖరీదు రూ.21,650కు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ పథకంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ముందు జాగ్రత్తగా టెండర్ల ద్వారా ఈ కొనుగోలు చేసి ఉండడం గమనార్హం.


