విజయ్ వైపు నేతల చూపు
సాక్షి,చైన్నె: తమిళగ వెట్రి కళగం నేత విజయ్ వైపు అనేక పార్టీలలోని అసంతృప్తి నేతలు దృష్టి పెట్టారు. ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు మొగ్గు చూపుతూ సంకేతాలను పంపిస్తున్నారు. త్వరలో పలు పార్టీలకు చెందిన అసంతృప్తి నేతలు, తమకు సీటు రాదన్న భావనతో ఉన్న వాళ్లు విజయ్ వైపు క్యూ కట్టనున్నట్టు చర్చ ఊపందుకుంది. అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగొట్టయన్ విజయ్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు పార్టీ వర్కింగ్ కమిటీ సమన్వయకర్త పదవితో పాటు కొంగు మండలం ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అలాగే, మరో నేత నాంజిల్ సంపత్ సైతం విజయ్ పక్షాన చేరారు. ఆయనకు ప్రచార కార్యదర్శి పదవి అప్పగించారు. విజయ్ తన పార్టీలోకి వచ్చే వారికి గుర్తింపు ఇస్తూ పదవులు అప్పగిస్తుండడంతో ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న సీనియర్లు అనేక మంది తాజాగా టీవీకే వైపుగా దృష్టి పెట్టే పనిలో పడ్డారు. విజయ్‌కు తమ ప్రతినిధుల ద్వారా సంకేతాలను పంపిస్తున్నారు. అన్నాడీఎంకే చెందిన పలువురు నాయకులు ఈ చేరిక జాబితా కసరత్తులలో ముందున్నట్టు చర్చ ఊపందుకుంది. అలాగే, మరికొన్ని పార్టీలకు చెందిన అసంతృప్తి నేతలు, తమకు సీటు రాదన్న భావనలో ఉన్న సిట్టింగ్‌లు కొందరు సైతం విజయ్ పక్షాన చేరడానికి సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఈనెల 9న పుదుచ్చేరిలో జరిగే సభలో అక్కడి వివిధ పార్టీల ముఖ్యనేతలు విజయ్ సమక్షంలో టీవీకేలో చేరడానికి సన్నద్ధమైనట్ట సమాచారం. అయితే, విజయ్ బహిరంగ సభకు కేవలం పది వేలమందికి మాత్రమే అనుమతి ఇస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విజయ్ పర్యటనకు భద్రత కల్పించాలని కోరుతూ టీవీకే వర్గాలు పోలీసులకు విన్నవించారు. కాగా, విజయ్ తమిళనాడు భవిష్యత్తు శక్తిగా అవతరిస్తారని సెంగొట్టయ్యన్ వ్యాఖ్యలు చేయడం విశేషం. విజయ్‌తో కాంగ్రెస్ ఢిల్లీ నేతల చర్చల గురించి తనకు తెలియదంటూ తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై వ్యాఖ్యలు చేయడమే కాకుండా, డీఎంకే కూటమి వెయ్యి రెట్లు బలంగా ఉందని స్పందించడం గమనార్హం.


