సౌమ్య అన్బుమణి ప్రచారం
సాక్షి, చైన్నె : పీఎంకేలో వివాదాల నేపథ్యంలో తన భర్తకు మద్దతుగా రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెట్టిన సౌమ్య అన్బుమణి తాజాగా ప్రచార ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. మహిళా హక్కుల సాధన నినాదంతో కాంచీపురం నుంచి శనివారం యాత్ర ప్రారంభించారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. రెండు గ్రూపులుగా విడిపోయి పీఎంకే కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అదే సమయంలో అన్బుమణిని పార్టీ నిర్వాహక అధ్యక్షుడి పదవి నుంచి రాందాసు తప్పించారు. ఆయన స్థానంలో తన పెద్దకుమార్తె శ్రీగాంధీని రంగంలోకి రాందాసు దించారు. ఈమె పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్లడమే కాకుండా, మహిళల్ని ఆకర్షించే విధంగా సభలు, సమావేశాలలో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితులలో అన్బుమణి శిబిరానికి మద్దతుగా ఆయన సతీమణి సౌమ్య అన్భుమణి రంగంలోకి దిగారు. గత లోక్‌సభ ఎన్నికలలో ధర్మపురి నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో సౌమ్య ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈమెకు రాజకీయాలు కొత్తమే కాదు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తండ్రి కృష్ణస్వామి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కాగా, ఆమె సోదరుడు విష్ణు ప్రసాద్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. తాజాగా పీఎంకే వివాద రాజకీయాలలో భర్తకు వెన్నంటి నిలిచే విధంగా అడుగులు వేశారు. చైన్నె శివారులోని ఉద్దండిలో గత నెల పీఎంకే, వన్నియర్ సంఘాల మహిళా నేతలతో సమావేశమయ్యారు. ఈ పరిస్థితులో మహిళల హక్కుల సాధన నినాదంతో, మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించే రీతిలో ప్రచార ప్రయాణాన్ని ప్రారంభించారు. ఉదయం కాంచీపురంలో జరిగిన కార్యక్రమంలో అధికారంలో మహిళకు సమాన అవకాశాలు, మద్యనిషేధం, మహిళలపై జరుగుతున్న హింసలకు వ్యతిరేకంగా ఆమె నినాదాలు చేశారు. రోజుకో జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా పీఎంకే వ్యవహారంపై సాగుతున్న వివాదం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నకిలీ డాక్యుమెంట్లను అప్పగించి పార్టీని అన్బుమణి కై వసం చేసుకున్నట్టు, ఆయనపై చర్యలు రాందాసు తరఫున పీఎంకే నేతలు జీకే మణి ఢిల్లీ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయడం గమనార్హం.


