తీవ్ర వాయుగుండంగా దిత్వా | - | Sakshi
Sakshi News home page

తీవ్ర వాయుగుండంగా దిత్వా

Dec 2 2025 8:24 AM | Updated on Dec 2 2025 8:26 AM

చైన్నె నగరం, శివారు జిల్లాల్లో

ఎడరతెరపి లేని వాన

ఒకే చోట కేంద్రీకృతంతో మరింతగా వర్షాలు

రోడ్లపై నీటి తొలగింపు పనుల్లో సిబ్బంది

అధికార యంత్రాంగం అలర్ట్‌

కెరటాల జడితో బీచ్‌లన్నీ మూత

రంగంలోకి విపత్తు నిర్వహణ బృందాలు

బలహీన పడ్డ దిత్వా తుపాన్‌ తీవ్ర వాయుగుండంగా మారింది. చైన్నె తీరానికి సమీపంలో గంటల తరబడి కేంద్రీ కృతమై ఉండడంతో అనేక చోట్ల ఎడ తెరపి లేని వర్షం మోస్తారుగా పడుతోంది. మరికొన్ని చోట్ల భారీగానే వర్షం పడింది. రోడ్లపై వరదలు కొంత మేరకు పోటెత్తడంతో కార్పొరేషన్‌ సిబ్బంది తొలగింపు పనులలో నిమగ్నమయ్యారు. చైన్నె, తిరువళ్లూరుకు మంగళవారం మధ్యాహ్నం వరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌ ఇచ్చారు.

నేడు చైన్నె, శివారు జిల్లాల్లోని

విద్యా సంస్థలకు సెలవు

వర్షాల నేపథ్యంలో మంగళవారం చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సముద్రంలో అలల తాకిడి అధికంగా ఉండటంతో చైన్నెలోని కాశీమేడు, తిరువొత్తియూరు, పట్టినంబాక్కం, బీసెంట్‌ నగర్‌ , నీలాంకరై, కోవళం తదితర బీచ్‌లన్నీ మూసి వేశారు. బీచ్‌లకు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు భద్రత కల్పించారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు తొమ్మిది గంటల పాటూ చైన్నె ఎన్నూరులో 19 సెం.మీ, మనలిలో 16 సెం.మీ, బ్రాడ్‌ వే 15 సెం.మీ, ఐస్‌ హౌస్‌ 14 సెం.మీ, వడపళని 13 సెం.మీవ, మేడవాక్కం, కత్తి వాక్కం 12 సెం.మీ, కాశిమేడులో 11 సెం.మీ వర్షం పడటం గమనార్హం. ఈ వర్షం మరింతగా రాత్రి వేళ పెరిగే అవకాశాలతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా చైన్నె, శివారులలో వ్యవహరిస్తున్నారు. ఎలాంటి విపత్తు ఎదురైనా సరే ఎదుర్కొనే విధంగా సన్నద్ధమయ్యారు.

చైన్నె సముద్ర తీరంలో కెరటాల ఉధృతి

సాక్షి, చైన్నె : కావేరి డెల్టా జిల్లాలోని నాగపట్నం, మైలాడుతురై, తిరువారూర్‌లో దిత్వా తుపాన్‌ శని, ఆదివారాలలో తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి కారైక్కాల్‌, పుదుచ్చేరి వైపుగా కదిలిన దిత్వా క్రమంగా వేగం తగ్గడంతో బలహీన పడింది. ఫలితంగా ఆదివారం చైన్నె, శివారులలో వర్షం కురువలేదు. అయితే తర్వాత పుదుచ్చేరి నుంచి చైన్నె వైపుగా కదిలిన దిత్వా బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో సోమవారం ఉదయం ఆరు నుంచి వరుణుడు బీభత్సం సృష్టించాడు.

చిరుజల్లులతో మొదలై...

చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు జిల్లాలో చిరు జల్లులతో మొదలైన వర్షం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి మరింతగా పెరిగింది. చైన్నె తీరానికి 50 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా సుమారు ఏడు గంటలకు పైగా ఒకే చోట కేంద్రీకృతం కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రభావంతో చైన్నె, శివారు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. శివారులలోని పూందమల్లి, ఆవడి, ఎన్నూరు. అంబత్తూరు ,మదుర వాయిల్‌బైపాస్‌. పోరూర్‌ మార్గం, పెరంబూరు, పటాలం పరిసరాలలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై వరద నీరు పోటెత్తడంతో వాహనల రాక పోకలకు తీవ్ర ఆటంకం తప్పలేదు. పూందమల్లి మార్గంలో వేలప్పన్‌ చావడి సర్వీసు రోడ్డులో వర్షపు నీటి గుంటలో ఓ కారు చిక్కుకుంది. హుటాహుటిన నీటి తొలగింపు పనులలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. చైన్నెలోని కామరాజర్‌ సాలైం, నుంగంబాక్కం హైరోడ్డు, శాంతోమ్‌ రోడ్డు పరిసరాలలో రోడ్లపై నీరు చేరడంతో మోటారు పంపు సెట్ల ద్వారా తొలగింపు పనులు వేగవంతం చేశారు. టీనగర్‌ పరిసరాలలోని లోతట్టు ప్రాంతాలలోకి సైతం నేరు చేరడంతో అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శివారులలోని తిరువళ్లూరు, చెంగల్పట్టు ,కాంచీపురం, రాణి పేట జిల్లాలలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉదయం వర్షం తేలికగా పడటంతో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వలేదు. దీంతో సాయంత్రం విద్యార్థులు వర్షంలో తడుచుకుంటూ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షానికి తోడుగా ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో గ్రీన్‌ వేస్‌ రోడ్డు, అన్నా నగర్‌, నుంగంబాక్కంతో పాటూ అనేక చోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు విరిగి పడటంతో హుటా హుటీన తొలగింపు పనిలో రెస్క్యూ బృందాలు నిమగ్నమయ్యాయి. గ్రీన్‌ వేస్‌ రోడ్డులో చెట్లు నేల కొరడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఒకే చోట తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం కావడంతో చైన్నె నుంచి అండమాన్‌ వైపుగా వెళ్లాల్సిన విమానాల సేవలు రద్దు చేశారు.

మరింత అలర్ట్‌

చైన్నె తీరానికి సమీపంలో కేంద్రీ కృతమైన తీవ్ర వాయుగుండం సాయంత్రం తర్వాత గంటకు మూడు కి.మీ వేగంతో నెమ్మది కదలడంతో పాటూ మేఘాలు కమ్ముకోవడం, గాలి ప్రభావం పెరగడం వెరసి చైన్నె, తిరువళ్లురు జిల్లాలకు మంగళవారం సాయంత్రం వరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. చెంగల్పట్టు, కాంచీపురం, రాణి పేట జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈదురు గాలుల ప్రభావంతో పాటూ అనేక చోట్ల మోస్తరుగా వర్షం పడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా మంగళవారం సాయంత్రం వరకు చైన్నె తీరంపై ప్రభావాన్ని చూపించవచ్చని అంచనా వేస్తున్నారు. తర్వాత చైన్నె తీరానికి మరింతగా సమీపించి ఆంధ్రా వైపుగా కదిలే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా, చైన్నె నగరంలో గత అనుభవాల దృష్ట్యా, ఎక్కడెక్కడ వర్షపు నీరు చేరేందుకు వీలున్నదో అక్కడంతా కార్పొరేషన్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. నగరంలోని 22 సబ్‌వే మార్గాలపై దృష్టి పెట్టారు. విల్లుపురం, కడలూరు తదితర జిల్లాలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు హుటాహుటిన చైన్నె, శివారు జిల్లాలకు చేరుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement