కనుల పండువగా గంధోత్సవం
ప్రసిద్ధి చెందిన నాగూర్ దర్గాలో
గంధోత్సవాన్ని ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కనుల పండువగా నిర్వహించారు. నాగపట్నం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చిన గంధంను సోమవారం వేకువజామున సమాధి వద్ద ఉంచి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం, హిందూ అన్న భేదాలు లేకుండా భక్తజనం వేలాదిగా
తరలి వచ్చారు. – సేలం
నాగపట్నం జిల్లా నాగూర్‌లో ప్రసిద్ధి చెందిన హజ్రత్ సయ్యద్ షాహుల్ హమీద్(నాగూర్ ఆండవర్) దర్గా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యం ముస్లింలతో పాటుగా హిందువులు సైతం తరలి వస్తుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ దర్గా వెలుపలి తలుపులు నిత్యం తెరిచి ఉంచడం, అంతర్గత తలుపులు నిర్ణీత సమయంలో మాత్రమే తెరుస్తారు. ఈ దర్గాకు ఐదు మినార్లు (గోపురాలు) ఉంటాయి. ఇందులో అతి పెద్ద మినార్‌ను మాత్రం మరాఠా పాలకులు నిర్మించినట్టు చరిత్ర చెబుతున్నది. హిందూ, ముస్లింల మధ్య శాంతియుత జీవనం, మార్గాన్ని సూచించే రీతిలో ప్రసిద్ది చెందిన ఈ దర్గాలో కందూరి ఉత్సవాలు అత్యంత వేడుకగా ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీ. పది రోజులకు పైగా ఈ ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. గత నెల 22వ తేదీ నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి.
నాగపట్నం నుంచి ఊరేగింపు
469వ కందూరి ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం సోమవారం వేకువజామున జరిగింది. నాగపట్నం నుంచి ఆదివారం గంధం ఊరేగింపు బయల్దేరింది. దారి పొడవునా మతాలకు అతీతంగా సర్వత్రా గంధోత్సవ రథాన్ని ఆహ్వానిస్తూ ముందుకు సాగారు. హిందూ, ముస్లిం మత సంప్రదాయాల మేరకు నైవేద్యాలు, నాదస్వరం, వాయిద్యాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగింపు జరిగింది. నాగూర్‌కు సరిగ్గా సోమవారంవేకువ జామున మూడు గంటలకు ఈ గంధం చేరుకుంది. అక్కడి నుంచి సంప్రదాయ పద్ధతిలో దర్గాలోని నాగూర్ ఆండవర్ సమాధికి గంధం పూసే ఉత్సవం కనుల పండువగా న్విహించారు. ఆంధ్రప్రదేవ్, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచే కాకుండా గల్ఫ్ , మలేషియా, సింగపూర్ తదితర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ గంధోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. ఈ వేడుకలో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఉత్సవం నేపథ్యంలో సోమవారం నాగపట్నం జిల్లాకు సెలవు ప్రకటించారు.
కనుల పండువగా గంధోత్సవం
కనుల పండువగా గంధోత్సవం


