డెల్టాలో దిత్వా నష్టంపై దృష్టి
సాక్షి, చైన్నె: దిత్వా తుపాన్ కారణంగా డెల్టాలో నష్టం తీవ్రతపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. త్వరితగతిన నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అక్టోబరులో కురిసిన వర్షానికి గాను బాధితులకు త్వరితగతిన నష్ట పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వివరాలు.. శ్రీలంకలో ప్రళయాన్ని సృష్టించి దిత్వా తుపాన్ నాగపట్నంకు సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. శని, ఆదివారాలలో నాగపట్నం, మైలాడుతురై, తిరువారూర్‌లో అతి భారీ వర్షాలు పడ్డాయి. ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన పనులపై అధికారులతో సచివాలయంలో ఉదయం సీఎం స్టాలిన్ సమీక్షించారు. పంటనష్టం, పంట పొలాలలకు ఎదురైన వరద ప్రభావం గురించి ఆరా తీశారు.
నాగపట్నం జిల్లా వ్యాప్తంగా 22 సెం.మీ , మైలాడుతురై జిల్లాలో 13 సెం.మీ , తిరువారూర్ జిల్లాలో 10 సెం.మీ, రామనాథపురం, తంజావూరు జిల్లాలో 9 సెం.మీ మేరకు వర్షం పడినట్టు అధికారులు వివరించారు. పంట నష్టం ,పంట పొలాల ఏ మేరకు నీరు పేరుకు పోయి ఉందో అన్న వివరాలను సేకరించే పనిలో ఉన్నట్టు అధికారులు వివరించారు. తక్షణం సమగ్ర వివరాలతో నష్టం తీవ్రత గురించి నివేదికను సమర్పించాలని అధికారులను ఈసంద్భంగా సీఎం ఆదేశించారు. అలాగే, అక్టోబరులో ఈశాన్యరుతు పవనాల సమయంలో కురిసిన వర్షానికి ఎదురైన నష్టం తీవ్రతను గురించి సైతం ఈసందర్భంగా సీఎంకు వివరించారు. అక్టోబరు 4,235 హెక్టార్లు 33 శాతం కంటే ఎక్కువ ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఈ బాధిత రైతులకు త్వరితగతిన నష్ట పరిహారం చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ మురుగానందం, రెవెన్యూ కార్యదర్శి ఎం సాయికుమార్, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి పి. అముధ, ఐ కమిషనర్ సి.జి. థామస్ వైద్యన్, వ్యవసాయ కార్యిదర్శి వి. దక్షిణామూర్తి, డైరెక్టర్ పి. మురుగేష్, ఉద్యానవన శాఖ అధికారి కుమారవేల్ పాండియన్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దిత్వా దెబ్బకు డెల్టాలో 2.10 లక్షల ఎకరాలలో పంట నష్ట జరిగినట్టుగా భావిస్తున్నారు. అలాగే నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలోని వాగులో నీటి ఉధృతికి ఇద్దరు కొట్టుకెళ్లి సోమవారం మరణించారు.


