సమాధుల తోటలో ఆంగ్లో ఇండియన్స్ సందడి
– ఆత్మీయుల సమాధుల వద్ద ఘన నివాళి
పాకాల: స్థానిక ఆర్‌సీఎం, సీఎస్‌ఐ చర్చి ఉమ్మడి శ్మశాన వాటికలో చాలా కాలం తరువాత ఆంగ్లో ఇండియన్స్ సందడి చేశారు. పాకాల రైల్వే డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు పదుల సంఖ్యలో ఆంగ్లో ఇండియన్స్ కుటుంబాలు స్థానికంగా ఉన్న రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవారు. ఇక్కడ సమాధుల తోటలో 18, 19వ శతాబ్దాల నాటి ఆంగ్లో ఇండియన్స్ సమాధులు ఉన్నాయని, నవంబర్ 2న ఆల్ సోల్స్ డే (ఆత్మల దినం)ని పురస్కరించుకుని స్థానిక స్మశాన వాటికలో సమాధులకు పెయింటింగ్ వేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం పనుల్లో నిమగ్నమయ్యారు. కాలక్రమంలో ఇక్కడి ఆంగ్లో ఇండియన్స్ కుటుంబాలు చైన్నె, డిల్లీ, ఆస్ట్రేలియా, బ్రిటన్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో శనివారం చైన్నె నుంచి ఒకప్పుడు పాకాలలో నివాసం ఉన్న ఆంగ్లో ఇండియన్ షైలీ తమ కుటుంబసభ్యులైన కుమార్తెలు, అల్లుల్లు, మనవరాళ్లతో విచ్చేసి తమ తల్లిదండ్రులు, సోదరుడు, వియ్యంకులు, ఇతర ఆత్మీయుల సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఆత్మశాంతికి ప్రార్థన చేశారు. గతంలో పాకాలలో నివాసం ఉన్న షైలీ ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె రాకను తెలుసుకున్న పలువురు పూర్వ విద్యార్థులు ఆమెతో కలసి పనిచేసిన టీచర్లు ఆమెతో కలుసుకుని ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికి గురయ్యారు.


