గ్రామీణ పాఠశాలలు అభివృద్ధి చెందాలి
వేలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెంది నిరుపేద విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే మేధాశక్తిని పెంచే విధంగా విద్యా బోధన చేయాలని తహసీల్దార్ జగదీశన్ తెలిపారు. ప్రపంచ రెడ్‌క్రాస్ నిర్వాహకులు జీన్ హెండ్రీ డోనాంట్‌న్115వ వర్ధంతి పురష్కరించుకొని కాట్పాడిలోని జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఇండియన్ రెడ్‌క్రాస్ సంఘం నిర్వాహకుడు జీన్ హెండ్రీ డోనాంట్‌న్115వ వర్ధంతి, ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ దినోత్సవంలో ప్రతి ఏడాది విద్యార్థులకు సేవాభావాన్ని అలవరుచుకునే విధంగా పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు చిన్నప్పటి నుంచే సేవాభావం అలవాటు అవుతుందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే జీన్ హెండ్రీ ఈ సంఘాన్ని ప్రారంభించారన్నారు. ఇందులోని సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందజేశారు. రెడ్‌క్రాస్ సంఘం కార్యదర్శి సేనా జనార్దన్, ఉపాధ్యక్షులు పారివల్లల్, శ్రీనివాసన్, కోశాధికారి పయణి, విజయకుమారి, రెడ్‌క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.


