
ఛాంపియన్‌గా కూతంబాక్కం ప్రభుత్వ పాఠశాల జట్లు
కొరుక్కుపేట: చైన్నె కాల్పందు లీగ్ సీజన్ 5 పేరుతో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీల్లో ఛాంపియన్‌లుగా కూతంబాక్కం ప్రభుత్వ పాఠశాల టీమ్‌లు నిలిచి ట్రోఫీలను కై వసం చేసుకున్నాయి. లాటెంట్ వ్యూ సంస్థ సీఎస్‌ఆర్ కార్యక్రమంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల్లో ఫుట్‌బాల్‌లో ప్రతిభను పెంపొందించేలా ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్‌పోటీలను వారం పాటూ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి 43 జట్లు, దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫైనల్స్ చైన్నెలోని నెహ్రూ స్టేడియం వేదికగా నిర్వహించారు. రసవత్తరంగా సాగిన ఫైనల్ పోటీల్లో కూతంబాక్కం ప్రభుత్వ పాఠశాల బాలుర జట్టు , బాలికల జట్టులు విజయం సాధించి డబుల్ ఛాంపియన్‌న్‌లుగా నిలిచాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇండియన్ టీమ్ క్రికెటర్ టి.నటరాజన్, జాతీయ స్థాయి ఎయిర్ రైఫిల్ షూటర్ నర్మద నితిన్ రాజ్‌లు పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు, సర్టిఫికెట్లు బహూకరించి అభినందించారు. కార్యక్రమంలో లాటెంట్ వ్యూ సంస్థ నిర్వాహకులు, ఉద్యోగులు పాల్గొని అతిథులను ఘనంగా సత్కరించారు.