
వైభవంగా శ్రీరాజశ్యామలాదేవి పూజ
● భక్తితో పూజలు చేసిన మహిళ సభ సభ్యులు
కొరుక్కుపేట: తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ (మద్రాసు యూనిట్ )ఆధ్వర్యంలో ఆడి మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ రాజశ్యామలాదేవి పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. చైన్నె జార్జ్ టౌన్‌లోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం మహా మండపంలో మహిళా సభ అధ్యక్షురాలు ప్రశాంతి సతీష్ అధ్యక్షతన పూజ చేశారు. ముందుగా దీపాన్ని, శ్రీరాజశ్యామలాదేవిలను వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. శ్రీ రాజశ్యామలా దేవికి పచ్చరంగు ఎంతో ప్రీతి అయినందున పచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించారు. దాదాపు 200 మంది మహిళలు పాల్గొని, శ్రీరాజశ్యామలాదేవి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు దిలీప్ కుమార్ పంతులు మహిళలందరితో దీప పూజ, శ్రీ జశ్యామలాదేవి పూజలను చేయించారు. విఘ్నేశ్వరున్ని ఆరాధిస్తూ ఆరంభమైన ఈ పూజా కార్యక్రమం దాదాపు గంట పాటు సాగింది. మహిళలంతా ఎంతో భక్తిశ్రద్ధల పూజలు చేసి, తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. మహిళా సభ అధ్యక్షురాలు ప్రశాంతి మాట్లాడుతూ 1983వ సంవత్సరంలో ప్రారంభమైన తమ సంస్థ ప్రతీ ఆడిమాసం మొదటి శుక్రవారం రోజున దీప పూజను చేస్తున్నట్టు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని శ్రీ రాజశ్యామల దేవి పూజను దిగ్విజయంగా నిర్వహించామని, అమ్మవారి ఆశీస్సులు మెండుగా లభించాలని ఆకాంక్షించారు. పూజల్లో పాల్గొన్న వారందరికీ అష్టోత్తర దండకం పుస్తకాలను పంపిణీ చేశారు. అంతకుముందు నిర్వహించిన పద్మలత వీణా వాయిద్య కచేరి, మహిళా సభ సభ్యుల వాసవీమాత గీతాలాపన అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భార్గవి అశోక్, కోశాధికారి ప్రసన్నలక్ష్మి, మల్లికా ప్రకాష్, కార్యవర్గ సభ్యులు, మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.