
సమర్థవంతంగా పనిచేయండి
– పోలీసులకు సీఎం స్టాలిన్ దిశానిర్దేశం
సాక్షి, చైన్నె : శాంతి భద్రతల పరిరక్షణలో ప్రణాళికాబద్ధంగా, సమర్థవంతంగా పనిచేయాలని పోలీసులకు సీఎం స్టాలిన్ సూచించారు. చైన్నెలోని ఓనమంచెరిలోని తమిళనాడు పోలీస్ ఉన్నత శిక్షణ సంస్థలో డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ శిక్షణ పూర్తి చేసుకున్న వారి పరేడ్ శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చైన్నె నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ వీక్షించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ శంకర్ జివ్వాల్, పోలీస్, శిక్షణ సంస్థ డైరెక్టర్ (ఇన్‌చార్జ్) సందీప్ రాయ్ రాథోడ్, తమిళనాడు పోలీస్ కళాశాల అదనపు డైరెక్టర్ పి.సి.తేన్మోళి, డిప్యూటీ డైరెక్టర్ శిక్షణ డి.పి.సురేష్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ టి.సెంథిల్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులును ఉద్దేశించి సీఎం మాట్లాడారు. శారీరక, మానసిక బలంతో పాటుగా దృఢసంకల్పంతో ఈ రంగంలోకి దిగుతున్న వారిని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఇక్కడ శిక్షణ ముగించుకున్న వారిలో తొమ్మిది మంది మహిళా డిప్యూటీ సూపరింటెంట్‌లు ఉండడం మరింత ఆనందంగా ఉందన్నారు.
జవాబుదారితనంగా ఉండాలి
ప్రతి పోలీసు అధికారి ప్రజలకు జవాబు దారిగా ఉండాలని సీఎం సూచించారు. ప్రజలు చెప్పే విషయాలను ఓపికగా వినాలని, న్యాయం ఎటు వైపు ఉందో నిజాయితీగా గుర్తించి, సేవలు అందించాలని కోరారు. ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాలు ప్రస్తుతం పోలీసు యంత్రాంగంలోకి వచ్చాయని గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ శాసీ్త్రయ విచారణ పద్ధతులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రణాళికాబద్ధంగా , సమర్థవంతంగా పని చేయాలని కోరారు.