
మూలకొత్తలంలో గృహాల కేటాయింపు
సాక్షి, చైన్నె: ఉత్తర చైన్నె పరిధిలోని రాయపురం మూల కొత్తలంలో 159 కుటుంబాలకు సొంత గృహాలను నిర్మించారు. వీరికి ఇళ్ల కేటాయింపు ఉత్తర్వులను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం అందజేశారు. రాయపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బేసిన్ బ్రిడ్జి రోడ్డులోని పాల్ డిపో, తండయార్ పేట ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 159 కుటుంబాలు వర్షాకాలంలో తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది తీవ్ర నష్ట, కష్టాలను ఎదుర్కొన్నారు. దీంతో వీరికి తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డ్ నేతృత్వంలో బహుళ అంతస్తుల తరహా ఫ్లాట్‌లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం మూల కొత్తలంలో హౌసింగ్ బోర్డులో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఫ్లాట్‌లలో పునరావాసం కోసం సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆయా కుటుంబాలకు గృహాల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రు, అన్బరసన్, శేఖర్‌బాబు, మేయర్ ప్రియ, ఎమ్మెల్యేలు ఆర్‌టీ శేఖర్, ఆర్ మూర్తి, పట్టణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కాకర్ల ఉషా , డిప్యూటీ మేయర్ ఎం.మహేష్ కుమార్, కమిషనర్ జె. కుమారగురుబరన్ తదితరులు పాల్గొన్నారు.