
పర్యాటక ప్రగతిపై సమీక్ష
సాక్షి, చైన్నె : తమిళనాడు పర్యాటక ప్రగతిపై ఆ శాఖ మంత్రి రాజేంద్రన్ శుక్రవారం జిల్లాల వారీగా సమీక్షించారు. పర్యాటక అభివృద్ధి ప్రణాళిక పనులపై దృష్టి పెట్టారు. చైన్నె వాలాజా రోడ్డులోని తమిళనాడు పర్యాటక అభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో జిల్లాల వారీ పర్యాటక ప్రాజెక్టుల తీరు తెన్నులపై అధ్యయనం చేశారు. పర్యాటకంగా మరిన్ని ప్రాంతాలను తీర్చిదిద్దే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా కొత్త ప్రాజెక్టులకు వివిధ అనుమతులు పొందే విషయంగా చర్చించారు. తెన్‌కాశి జిల్లా గుండారు, తిరుపత్తూరు జిల్లా ఏలగిరి, పుదుక్కోట్టై జిల్లా ముట్టుకాడుబీచ్, తిరువళ్లువర్ పూండి రిజర్వాయర్ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చేపట్టిన ప్రాజెక్టుల గురించి సమీక్షించి పనుల త్వరలోచేపట్టేందుకు సిద్ధమయ్యారు. మదురైలో తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హోటల్ డివిజన్ 2 అత్యాధునిక వసతి సౌకర్యంతో నిర్మాణ పనులు గురించి ఈ సందర్భంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్, పర్యాటక శాఖ డైరెక్టర్ క్రిస్తురాజ్, మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ ఎస్.కవిత, ఇంజినీర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు , అన్ని జిల్లా పర్యాటక అధికారులు పాల్గొన్నారు.