
● గళం జ్వలింప చేద్దాం! ● ఉభయ సభల్లో ఢీకి డీఎంకే రెడీ ●
సాక్షి, చైన్నె : ఉభయ సభల్లో ఒకే గళం.. ఒకే నినాదంతో తమ వాణి గట్టిగా వినిపించాలని డీఎంకే తీర్మానించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభకానున్న విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో తమిళనాడు నుంచి డీఎంకే కూటమికి చెందిన 39 మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇందులో డీఎంకే సభ్యులు 22 మంది ఉన్నారు. అలాగే, రాజ్యసభలోనూ డీఎంకే సభ్యులు 10 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎంపీలను చైన్నెకు శుక్రవారం ఉదయం స్టాలిన్ పిలిపించారు. వీరితో తేనాంపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ అధ్యక్షత వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి దురై మురుగన్, కోశాధికారి, ఎంపీ టీఆర్ బాలు సమావేశ ముఖ్యోద్దేశాలను వివరించారు. సీనియర్ ఎంపీలు కనిమొళి కరుణానిధి, తిరుచ్చి శివ, ఎ రాజ, జగద్రక్షకన్, టీకేఎస్ ఇళంగోవన్, దయానిధి మారన్‌తో పాటు ఇటీవల రాజ్యసభకు కొత్తగా ఎంపికై న ఎస్‌ఆర్ శివలింగం, సల్మా, మళ్లీ రెండో సారీగా ఎంపికై న విల్సన్‌తోపాటు పార్లమెంట్, రాజ్య సభ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్రంలోని బీజేపీని ఢీ కొట్టేలా ఎంపీల పనితీరు ఉండేలాగా స్టాలిన్ ఆదేశాలు ఇచ్చారు. సమావేశాలకు ప్రతి ఒక సభ్యుడూ హాజరుకావాలని రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించే అంశాలపై కేంద్ర మంత్రులను నిలదీయాలని, కూటమి పార్టీల సభ్యులను కలుపుకుని తమిళ గళాన్ని గట్టిగా వినిపించాలని ఆదేశించారు. చివరగా ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసిన ప్రకటించారు. కాగా, ఈ సమావేశంలో సభ్యులకు స్టాలిన్ క్లాస్ పీకినట్టు సమాచారం. కొందరు సభ్యులు మిత్ర పక్షాల మధ్య విభేదాలకు దారి తీసే రీతిలో వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, సమష్టిగా, ఐక్యతతో, ఒకే గళం, ఒకే నినాదంతో ఢిల్లీని ఢీ కొట్టాలని ఆదేశించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
తీర్మానాలు
11 సంవత్సరాలుగా తమిళనాడును మోసం చేస్తూ వస్తున్న బీజేపీ తీరును ఎండగట్టడం లక్ష్యంగా నిర్ణయించారు. విద్య, ఆర్థికపరంగా తమిళనాడుకు జరుగుతున్న అన్యాయంపై నిలదీయడం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం స్వరాన్ని వినిపించేందుకు తీర్మానించారు. ఇది తమిళనాడు ప్రజల ఐక్య స్వరంగా వాయిస్ ఆఫ్ ది సొసైటీ నినాదంతో పార్లమెంటు సభ్యుల గొంతుకలో ప్రతి ధ్వనిస్తుందని ప్రకటించారు.
తమిళనాడు సమస్యలే కాదు, దేశంలోని అతి ముఖ్యమైన సమస్యలను కూడా పార్లమెంట్‌లో లేవనెత్తేలా, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించే రీతిలో ఉభయ సభల్లో ప్రజాస్వామ్య ఉద్యమం సాగించాలని నిర్ణయం.
మే 24వ తేదీన జరిగిన నీతి ఆయోగ్ భేటీలో వైగై, తామరభరణి నదులను శుభ్ర పరిచేందుకు కొత్త ప్రాజెక్టును ప్రకటించాలని, అందరికీ సమాచారం సులభతరం చేసేలా ప్రణాళికలు, పథకాలకు ఆంగ్లంలో పేర్లు సూచించాలని, శ్రీత్రిభాషా విధానానికి వ్యతిరేకగా సూచనలు చేసినా, ఇంతవరకు ఖాతరు చేయకపోవడంపై కేంద్రాన్ని నిలదీయాలని తీర్మానం చేశారు.
బీజేపీయేతర రాష్ట్రాలపై చిన్నచూపు, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం, ఏకీకృత పన్ను విధానంలో రాష్ట్రాల మధ్య 50 శాతం పన్ను భాగస్వామ్యం, 10వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం చెల్లించాల్సిన 41 శాతం పన్ను వాటా, ఆర్థికంగా జరుగుతున్న అన్యాయం గురించి ఉభయ సభల్లో కేంద్రాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు.
కీలడి పురావస్తు పరిశోధన నివేదికలను బయట పెట్టాలని కేంద్రంతో ఢీ కొట్టేలా ప్రత్యేక తీర్మానం చేశారు. తమిళ సంస్కృతి, పురాతనత్వంపై కేంద్ర ప్రభుత్వ మౌనం వహించడం, కీలడి అధ్యయనాన్ని తిరస్కరించడం, రైల్వే ప్రాజెక్టులలో నిర్లక్ష్యాలు, వైఫ్యలాలు, గ్రామీణ శ్రామిక ప్రజలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం చేస్తున్న మోసం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు, రాష్ట్ర ఆర్థిక స్వయంప్రతిపత్తికి కల్పిస్తున్న ముప్పు, ఆర్థిక హక్కులకు భంగం కలిగించేలా తమిళనాడు నిరంతర కేంద్రం చేస్తూ వస్తున్న మోసాలను ఖండిస్తూ తమ స్వరాన్ని మోగించేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్ర స్వయంప్రతిపత్తి హోదా, ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని బిహార్ వంటి రాష్ట్రాలలో సాగుతున్న కేంద్రం కుట్రలు, తమిళ జాలర్లపై నిరంతరం జరుగుతున్న దాడులు, విద్యను రాష్ట్ర జాబితాలోకి చేర్చాలన్న డిమాండ్, తిరుక్కురల్‌ను జాతీయ గ్రంథంగా ప్రకటించడం, తమిళంతో సహా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలను వారి వారి మాతృభాషల్లో కాకుండా హిందీ, సంస్కృతంతో రుద్దేందుకు చేస్తున్న కేంద్రం ప్రయత్నాలను నిలదీయాలని నిర్ణయించారు. రైల్వే చార్జీల పెంపును ఖండించారు.
తమిళనాడు ఆర్థిక హక్కులు, భాషా హక్కులు, విద్యాహక్కుతో సహా భారత దేశంలోని సమస్యలను ద్రవిడ మున్నేట్ర కళగం ఎంపీలు తమ గళాన్ని బలంగా వినిస్తారని, 11 సంవత్సరాలుగా తమిళనాడును మోసం చేస్తూ, తమిళులపై అబద్ధాలు గుప్పిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలను అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఒకే గళం.. ఒకే నినాదంతో తమ వాణిని పార్లమెంట్, రాజ్య సభల్లో గట్టిగా వినిపించడానికి డీఎంకే ఎంపీలు సిద్ధమయ్యారు. ఉభయ సభలలో అధికార బీజేపీని ఢీ కొట్టేలా సమరానికి సన్నద్ధమయ్యారు. ఈ మేరకు పార్టీ ఎంపీలకు శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు.

● గళం జ్వలింప చేద్దాం! ● ఉభయ సభల్లో ఢీకి డీఎంకే రెడీ ●

● గళం జ్వలింప చేద్దాం! ● ఉభయ సభల్లో ఢీకి డీఎంకే రెడీ ●