
రైతు బిడ్డను.. అందుకే బస్సులో ప్రయాణం
● మీ వలే కోటీశ్వరుడ్ని కాదు ● సీఎం స్టాలిన్‌కు ప్రతిపక్ష నేత పళణి స్వామి చురకలు
సాక్షి, చైన్నె : తాను రైతు బిడ్డను అయినందునే సుందరం ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నానని, తమరి వలే కోటీశ్వరుడ్ని కాదుగా? అని సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధానప్రతి పక్ష నేత ఎడపాడి కె పళణిస్వామి చురకలు అంటించారు. తమిళనాడు, ప్రజలు రక్షిద్దామన్న నినాదంతో పళణిస్వామి ప్రజా చైతన్య యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రను సుందరం ట్రావెల్స్ సినిమాను గుర్తు చేస్తూ సీఎం స్టాలిన్ విమర్శలు గుప్పించారు. సుందరం ట్రావెల్స్ బస్సులో పొగలు చిమ్ముకొచ్చినట్టుగా, ఇక్కడ పళణి నోట అబద్దాల పుట్ట బయటకు వస్తున్నట్టు వ్యాఖ్యల తూటాలు పేల్చారు. ఇందుకు పళణిస్వామి ధీటుగానే శుక్రవారం స్పందించారు. తన పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం మైలాడుతురైలోని వైదీశ్వరన్ ఆలయంలో పళణిస్వామి పూజలు చేశారు. అనంతరం శీర్గాలిలో పర్యటించారు. తిరువారూర్ జిల్లాలోకి ప్రవేశించిన పళణిస్వామికి మాజీ మంత్రి కామరాజ్ నేతృత్వంలో ఘన స్వాగతం లభించింది. డీఎంకే దివంగత నేత కరుణానిధి పుట్టిన గడ్డ తిరువారూర్‌లో డీఎంకేను టార్గెట్ చేసిన పళణిస్వామి తీవ్రస్థాయి విమర్శలతో దూసుకెళ్లారు.
కోటీశ్వరుడ్ని కాను..
తనను ఉద్దేశించి సుందరం ట్రావెల్స్ అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తూ, తమిళనాడులో ప్రస్తుతం అన్ని బస్సుల పరిస్థితి అలాగే ఉందని ఎదురుదాడి చేశారు. ప్రభుత్వ బస్సులన్నీ సుందరం ట్రావెల్స్‌గా మారి ఉన్నాయని, ఎక్కడ ఆగుతుందన్న విషయం డ్రైవర్లకు కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. తాను రైతు బిడ్డను అయినందునే సుందరం ట్రావెల్స్ వంటి బస్సులో పయనిస్తున్నానని, తాను బస్సులో పయనిస్తున్నట్టుగా ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అని స్టాలిన్‌ను ఉద్దేశించి చమత్కరించారు. కరుణానిధి పలుమార్లు రాష్ట్ర సీఎం, పార్టీ అధ్యక్షుడు అంటూ, తానేమీ స్టాలిన్ వలే కోటీశ్వరుడ్ని కాదని, ఆయన వలే బెంజ్ కార్లు, హెలికాఫ్టర్లలో పర్యటించలేనని పేర్కొంటూ, ప్రత్యేక విమానంలో పర్యటించే స్తోమత లేదని వ్యాఖ్యానించారు. డీఎంకే కుటుంబానికి చెందిన 8 వేల కోట్లు వారి ట్రస్టులోనే ఉన్నాయని, దీన్ని బట్టి చూస్తే, వారు తలచుకుంటే సొంతంగా విమానం కూడా కొనేసే ఉంటారని వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
బయట చెప్పలేం
మీడియాతో మాట్లాడుతూ, త్వరలో బ్రహ్మాండ శక్తి కలిగిన పార్టీ తమతో చేతులు కలపనున్నట్టుగా పళణి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ సందించిన ప్రశ్నకు పొత్తు, ఎన్నికల వ్యూహాలను బయటకు చెప్పలేమన్నారు. ఆ పార్టీ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రికళగంగా పరిగణించి వచ్చా? అని ప్రశ్నించగా, నిరాకరించకుండా ఎన్నికల వ్యూహాలకు బయటకు చెప్పడానికి కుదరదంటూ దాటవేశారు. విజయ్ అన్నాడీఎంకే కూటమిలోకి వచ్చిన పక్షంలో బీజేపీని పక్కన పెడుతారా? అని ప్రశ్నించగా ఊహాజనితాలకు ఇప్పడు సమాధానాలు లేవంటూ దాట వేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి, అన్నాడీఎంకే సొంతంగా సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.