
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కడలూరు జిల్లా బన్రూటి నియోజకవర్గం అన్నాడీఎంకే మహిళా విభాగం నేత సత్యా పన్నీరు సెల్వం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆమె మాజీ మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్టు ఆమైపె ఏసీబీకి ఫిర్యాదులు చేరాయి. అలాగే, ఆమె భర్త పన్నీరు సెల్వం బన్రూటి మునిసిపాలిటీ చైర్మన్‌గా ఉన్న కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్టు ఆరోపనలు వచ్చాయి. ఈ ఫిర్యాదులను పరిగణించిన ఏసీబీ ఇటీవల కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఏసీబీ అధికారుల బృందం, సత్య పన్నీరు సెల్వం నివాసంలో విస్తృతంగా సోదాలు చేసి, కొన్ని రికార్డులను పట్టుకెళ్లారు.
పారిశ్రామిక వేత్త ఇళ్లలో
ఈడీ సోదాలు
సాక్షి, చైన్నె : చైన్నెలోని ఇద్దరు పారిశ్రామిక వేత్తల నివాసాలు, కార్యాలయాలు, పరిశ్రమల్లో శుక్రవారం ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టుగా తమకు అందిన సమాచారం మేరకు ఈ సోదాల్లో ఈడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి, పొద్దు పోయే వరకు తనిఖీలు నిర్వహించారు. అరుణ్ గుప్త అనే పారిశ్రామిక వేత్త, దీపక్ గుప్త అనే మరో పారిశ్రామిక వేత్త నివాసం, కార్యాలయాలు, అంబత్తూరులోని స్టీల్ పరిశ్రమల్లో ఈ సోదాలు విస్తృతంగా జరిగాయి.
ఎజ్రా సర్గుణం రోడ్డు
బోర్డు ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : కీల్పాకంలో ఎజ్రా సర్గుణం రోడ్డు బోర్డును మంత్రులు కేఎన్ నెహ్రు, శేఖర్‌బాబు శుక్రవారం ఆవిష్కరించారు. తమిళనాడు మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా అణగారి, వెనుకబడిన వర్గాల ప్రజల హక్కుల కోసం గళం విప్పిన బిషప్ ఎజ్రా సర్గుణం గత ఏడాది కన్ను మూసిన విషయం తెలిసిందే. ఈసీఐ చర్చ్‌లతో క్రైస్తవ సామాజిక వర్గానికి అత్యంత నమ్మకం కలిగిన బిషప్‌గా అవతరించిన ఆయన డీఎంకే దివంగత నేత కరుణానిధికి అత్యంత సన్నిహితులు. ఆయన నివాసం ఉన్న కీల్పాకంలోని రోడ్డుకు ఎజ్రా సర్గుణం పేరు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం చైన్నె కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆయన నివాసం ఉన్న రోడ్డుకు ఎజ్రా సర్గుణం రోడ్డు అన్న నామకరణం చేసిన బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆర్ ప్రియ, కమిషనర్ కుమర గురుబరన్, తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు వేలు ప్రభాకరన్ కన్నుమూత
తమిళసినిమా: దర్శకుడు వేలు ప్రభాకరన్ అనారోగ్యం కారణంగా చైన్నెలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 68 ఏళ్లు. వేలు ప్రభాకరన్ మొదట చాయాగ్రహకుడిగా పని చేశారు. ఆ తరువాత దర్శకుడిగా అవతారమెత్తి 1989లో నాళైయ మనిదన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తరువాత సత్యరాజ్ హీరోగా పిక్‌పాకెట్, మోహన్ నటించిన ఉరువం, ప్రభు కథానాయకుడిగా నటించిన ఉత్తమరాసా తదితర చిత్రాలకు చాయాగ్రహకుడిగా పని చేశారు. అలాగే పుదియ కట్టి, అసురన్, కడవుల్, పురట్చికారన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలు కాదల్ కథై, ఒరు ఇయక్కునారిన్ కాదల్ చర్చనీయాంఽశంగా మారాయి. కాగా వేలు ప్రభాకరన్ నటుడిగానూ పలు చిత్రాల్లో నటించారు. ఈయన చివరిగా నటించిన చిత్రం ఖజానా. వేలు ప్రభాకరన్ మొదటి భార్య పేరు పీ.జయాదేవి. కాగా ఈయన 60 ఏళ్ల వయసులో 25 ఏళ్ల షిర్లే దాస్ అనే నటిని రెండో వివాహం చేసుకున్నారు. షిర్లే దాస్ ఈయన దర్శకత్వం వహించి, నటించిన కాదల్ కథై చిత్రంలో నాయకిగా నటించారన్నది గమనార్హం. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. కాగా వేలు ప్రభాకరన్ భౌతిక కాయాన్ని స్థానిక వలసరవాక్కంలోని ఆయన ఇంటి వద్ద సందర్శనార్ధం ఉంచారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా వేలు ప్రభాకరన్ భౌతిక కాయానికి ఆదివారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి.

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఏసీబీ సోదాలు