
చిక్కుల్లో మాజీ మంత్రి కేసీ వీరమణి
● ఎన్నికల కేసు రద్దుకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, చైన్నె: ఎన్నికల ప్రమాణ పత్రంలో ఆస్తి వివరాలను గోప్యంగా ఉంచడం, నకిలీ పాన్‌కార్డు నెంబర్ పొందుపరచడం వెరసి మాజీ మంత్రి కేసీ వీరమణి మెడకు ఉచ్చుగా మారి ఉన్నాయి. ఆయనపై దాఖలైన కేసును త్వరితగతిన విచారించే విధంగా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో వరసు విజయాలతో దూసుకొచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా అన్నాడీఎంకే మంత్రి కేసీ వీరమణి తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట నుంచి మళ్లీ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో ఆయన డీఎంకే అభ్యర్థి దేవరాజ్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికలలో వీరమణి అక్రమాలకు పాల్పడినట్టు, ప్రధానంగా నామినేషన్‌లో అన్నీ తప్పుల తడక అని ఆరోపణలు బయల్దేరాయి. ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన సమాచారంతో ఎన్నికల కమిషన్ సైతం రంగంలోకి దిగింది. నామినేషన్ ప్రమాణ పత్రంలో ఆస్తి వివరాలను దాచి పెట్టినట్టు, నకిలీ పాన్ నెంబర్‌ను పొందు పరిచినట్టుగా సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ తిరుపత్తూరు కోర్టులో సైతం విచారణలో ఉంది. ఈ వ్యవహారంపై ఐటీ అధికారులు సైతం రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
రద్దుకు నిరాకరణ
కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును వీరమణి ఆశ్రయించారు. ఆధారరహితంగా తనపై కేసు దాఖలైందని, స్వయంగా విచారణకు హాజరు కావడం నుంచి మినహాయింపుతోపాటుగా కేసును రద్దు చేయాలని ఆయన చేసుకున్న విజ్ఞప్తిని శుక్రవారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వేల్ మురుగన్ నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించింది. ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది రాజగోపాలన్ హాజరై వాదనలు వినిపించారు. ఈసీ, ఐటీ విచారణను వివరించారు. వాదనల అనంతరం మాజీ మంత్రి వీరమణి విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. విచారణ, కేసును రద్దు చేయలేమని స్పష్టం చేశారు.అదే సమయంలో తిరుపత్తూరు కోర్టులో జరుగుతున్న విచారణ త్వరితగతిన ముగించే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. అదే విధంగా ఎన్నికల కమిషన్ సైతం త్వరితగతిన విచారణ ముగించే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు.